‘ఉడ్తా పంజాబ్’కు ఓకే
‘స్టే’కు సుప్రీంకోర్టు, పంజాబ్ - హరియాణా హైకోర్టు తిరస్కృతి
చండీగఢ్: సెన్సార్షిప్ వివాదంలో చిక్కుకున్న ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం విడుదలకు అన్ని అడ్డంకులూ తొలిగాయి. ఈ సినిమా విడుదలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు, పంజాబ్-హరియాణా హైకోర్టులు నిరాకరించాయి. దీంతో డ్రగ్స్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా.. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. దీని విడుదలపై స్టే విధించాలని హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమనిస్పష్టం చేసింది.దీనిపై పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ ఉందని పేర్కొంది. హైకోర్టును పిటిషనర్ ఆశ్రయించారు. అలాగే ఈ చిత్రం విడుదలకు వ్యతిరేకంగా మరో పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలైంది. ఈ రెండు పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.
మరోవైపు ఈ సినిమా ఆన్లైన్లో లీక్ కావడంపై సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ మండిపడ్డారు. పైరసీ కాపీ వివిధ టోరెంట్ వెబ్సైట్లలో దర్శనమిచ్చింది. ఇందులో ‘ఫర్ సెన్సార్’ అని ఉండటంతో లీక్‌లో సెన్సార్ బోర్డుకు ఏమైనా పాత్ర ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా, ఆన్లైన్ లీక్‌కు సంబంధించి వచ్చిన వార్తలను సీబీఎఫ్సీ చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ తోసిపుచ్చారు.