Human Rights Platform
-
నేలమాలిగలు.. ఈస్ట్రోజన్ ఇంజెక్షన్లు లేవు!
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట కేంద్రంలోని వేశ్యాగృహాల్లో నేలమాలిగలు లేవని, అలాగే ఈస్ట్రోజన్ ఇంజెక్షన్లు వాడలేదని మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) తెలిపింది. ఇది కేవలం కొన్ని సంస్థలు చేస్తున్న ప్రచారం మాత్రమేనని అభిప్రాయపడింది. యాదగిరిగుట్టలో వేశ్యావృత్తిని నిర్వహిస్తున్న వారిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు జరిపి పీడీ యాక్టు కింద అరెస్టు చేసి జైళ్లకు తరలించి ఆర్నెల్లుగా జైళ్లలో ఉంచిన నేపథ్యంలో ఈ నెల 8న మానవ హక్కుల వేదిక బృందం యాదగిరిగుట్టకు చేరుకుని అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అన్నీ హృదయవిదారక అంశాలే... యాదగిరిగుట్ట వేశ్యాగృహాలను నిర్వహిస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేసి జైళ్లకు, బాలికల సంరక్షణ గృహాలకు తరలించారు. వారి ఇళ్లకు తాళం వేయడంతో మిగిలిన కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న హెచ్ఆర్ఎఫ్ బృందం బాధితులను పరామర్శించడంతో వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అరెస్టు కాని కుటుంబ సభ్యుల్లో కొందరు ఇతర ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకోగా.. మరికొందరికి అవి కూడా దొరకలేదు. కొందరు గుడారాలు వేసుకుని నివసిస్తున్నారు. ఈ గుడారాల్లో ఓ బాలింత సైతం పసికందుతో అవస్థలు పడుతూ ఉంది. ఇటు పీడీ యాక్టుపై జైలుకు వెళ్లి వచ్చిన వారి పరిస్థితిదుర్భరంగా మారింది. దీన్ని చూసి హెచ్ఆర్ఎఫ్ సభ్యులు చలించిపోయారు. పునరావాసం ఎక్కడ...: వేశ్యావృత్తిని మానేసిన వారు ఇతర ఉపాధి పనులకు వెళ్తున్నారని హెచ్ఆర్ఎఫ్ తెలిపింది. ‘వేశ్యావృత్తిని మానేసినట్లు ప్రత్యేకంగా బోర్డులు తగిలించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పునరావాసం, ఆర్థిక సాయం అందలేదు. బాధితులకు పునరావాసం కల్పించడంతో పాటు వారి ఇళ్లను వారికే అప్పగించాలి. హోంలలోని పిల్లలను వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చాలి..’అని నివేదికలో కోరింది. అవన్నీ నిరాధారం.. వేశ్యాగృహాల్లో పిల్లలను నేలమాలిగల్లో రహస్యంగా పెంచుతున్నట్లు, వారు త్వరగా ఎదిగేందుకు ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు చేస్తున్నట్లు పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. కానీ అదంతా ప్రచారమేనని హెచ్ఆర్ఎఫ్ బృందం అభిప్రాయపడింది. అక్కడ అలాంటి పరిస్థితేమీ లేదని.. అందుకు తగ్గ ఆధారాలు కూడా ఏమీ కనిపించలేదని వెల్లడించింది. ‘ఈ ఆరోపణల ఆధారంగా ఓ ఆర్ఎంపీ వైద్యుడి క్లినిక్‌పై పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఆస్పత్రి సీజ్ చేసినప్పటికీ అక్కడ ఈస్ట్రోజన్‌కు సంబంధించిన ఆధారాలు దొరకలేదు. మరి ఆ వైద్యుడిని ఎందుకు అరెస్టు చేశారో అర్థం కాలేదు. 33 మంది బాధిత బాలికలను రెండు హోంలకు తరలించారు. ఆమన్‌గల్‌లో ప్రజ్వల నడుపుతున్న హోంలో 20 మంది, మిగిలిన 13 మందిని నల్లగొండలోని శిశు విహార్‌కు పంపించారు. అయితే ప్రజ్వల హోంలోని పిల్లలను చూసే అవకాశం కూడా ఇవ్వడం లేదు..’అని హెచ్ఆర్ఎఫ్ పేర్కొంది. -
ప్రజల హక్కుల్ని హరిస్తే ఎలా సారూ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్బంధ పరిస్థితులు నెలకొన్నాయని, అవి ప్రజలకు ఆందోళనకరంగా ఉన్నాయని మానవ హక్కుల వేదిక పేర్కొంది. ప్రత్యామ్నాయ ఆలోచనల పట్ల, ప్రజల అభిప్రాయాల వ్యక్తీకరణపట్ల ప్రభుత్వం తీవ్ర అసహనంతో వ్యవహరిస్తోందని వేదిక అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు, ప్రధానకార్యదర్శి జి.మోహన్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వతీరుపై మానవ హక్కుల వేదిక సీఎం కేసీఆర్‌కు బుధవారం బహిరంగ లేఖ రాసింది. ప్రివెంటివ్ డిటెన్షన్, బహిరంగసభలు, ఊరేగింపులను క్రమబద్ధీకరించే చట్టాలైన సెక్షన్ 30, సెక్షన్ 144ను పోలీసులు విచక్షణారహితంగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా మీటింగులకు అనుమతినివ్వడం లేదని, రైతు సమస్యలపై నిరసన తెలిపినా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
సుప్రీం కోర్టులో న్యాయం జరగొచ్చు
► వాకపల్లి సంఘటనపై మేధావుల ఆశాభావం ► గిరిజన మహిళల పోరాటానికి పదేళ్లు ► మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో సదస్సు బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): వాకపల్లి బాధిత గిరిజన మహిళలకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని మేధావులు వ్యక్తంచేశారు. విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం వాకపల్లిలో 2007 ఆగస్టు 20న గ్రేహౌండ్స్ దళాలు 11 మంది కోందు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులు రావడం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన చోటుచేసుకుని పదేళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలోని ఒక హోటల్లో ఆదివారం మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది వసుధ నాగరాజ్ మాట్లాడుతూ, అప్పట్లో కొండకోనల్లో 15 కిలోమీటర్లు నడుచుకుంటూ పాడేరు సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వచ్చి బాధిత మహిళలు ఫిర్యాదు చేశారంటే గ్రేహౌండ్స్ పోలీసులు ఎన్ని చిత్ర హింసలకు గురిచేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ సంఘటనపై నిందితులైన 21 మంది పోలీసులపై కేసు నమోదు చేసి విచారించాలని 2008 ఆగస్టులో పాడేరు మేజిస్రేట్ కోర్టు తీర్పు చెప్పిందని గుర్తుచేశారు. అయితే నిందితులు హైకోర్టుకు వెళ్లడంతో విచారణపై స్టే ఇచ్చారన్నారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించగా వారు పోలీసులు అత్యాచారానికి పాల్పడలేదని నివేదిక ఇవ్వడం దారుణమన్నారు. అప్పట్లో ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను కూడా ప్రభావితం చేశారని ఆరోపించారు. న్యాయం కోసం గిరిజన మహిళలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉందని, ఒక వేళ అక్కడా కొట్టివేస్తే అది కోర్టు ఓటమి అవుతుంది తప్ప ఆదివాసీ మహిళల ఓటమి కాదని అభిప్రాయపడ్డారు. ఆదివాసీ రచయితల సంఘం రామారావు దొర మాట్లాడుతూ కోందు జాతి ప్రజలను పోలీసులు మావోయిస్టుల్లా చూస్తున్నారని, వారిని అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో గత పదేళ్లుగా వాకపల్లి గ్రామస్తులు బయటకు రావటం మానేశారన్నారు. మానవ హక్కుల వేదిక ప్రతినిధి ప్రొఫెసర్ జీవన్‌కుమార్ మాట్లాడుతూ గిరిజనులు మావోయిస్టులకు సహాయం చేస్తున్నారనే నేపంతో పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేసి చిత్ర హింసలకు గురుచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాకపల్లి మహిళలు అన్నిరకాల ఒత్తిళ్లనూ తట్టుకుని ధైర్యంగా నిలబడటం గొప్పవిషయమన్నారు. ఈ పదేళ్ల కాలంలో ఇద్దరు బాధిత మహిళు మరణించారని తెలిపారు.మహిళా చేతన నాయకురాలు కె.పద్మ మాట్లాడుతూ, మావోయిస్టులపై ప్రతీకారం కోసమే గ్రేహౌండ్స్ దళాలు వాకపల్లి మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా వాటిని బయటకు రానీయకుండా ఉన్నాతాధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
టఫ్ కార్యాలయాన్ని సీఎం తెరిపించాలి
మానవహక్కుల వేదిక సాక్షి, హైదరాబాద్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టఫ్) కార్యాలయానికి పోలీసులు తాళం వేయడం చట్టవ్యతిరేక చర్య అని మానవ హక్కుల వేదిక పేర్కొంది. హోంమంత్రి ఆదేశాలు కూడా పోలీసులు ఖాతరు చేయలేదు కాబట్టి, సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని కార్యాలయం తాళం తెరిపించేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ కార్యాలయంపై జరిగిన పోలీసు దాడిపై ఎస్.జీవన్‌కుమార్, సయ్యద్ బిలాల్, ఇందిర, సంజయ్, నటరాజ్లతో కూడిన వేదిక బృందం నిజనిర్థారణ కమిటీగా ఏర్పడి ఈ కార్యాలయానికి తాళం వేసిన ఘటనపై విషయ సేకరణ చేసినట్టు తెలిపింది. విమలక్క చెప్పిన ప్రకారం అధికారపక్ష నాయకులు అకారణ కక్షతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి వేధింపులకు పాల్పడుతున్నారని భావించాల్సి వస్తుందని తెలిపింది. ఈ కార్యాలయం తనిఖీకి ఎలాంటి ఆదేశం, వారెంట్ లేకుండా పోలీసులు అక్రమంగా సెర్చ్ చేసి కొన్ని పుస్తకాలు, కరపత్రాలను, కళాకారులు ఉపయోగించే డప్పులను స్వాధీనం చేసుకున్నట్లు తమ కమిటీ పరిశీలనలో వెల్లడైందని జీవన్‌కుమార్, సయ్యద్ బిలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. అరుణోదయ, టఫ్ కార్యాలయాల విషయంలో కాలనీవాసుల నుంచి ఏవైనా ఫిర్యాదులు వచ్చాయా అని తాము చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో వాకబు చేయగా అటువంటిదేమి లేదని పోలీసులు తెలిపారన్నారు. -
ముంపు బాధితులకు అండగా ఉంటాం
మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు బాదావత్ రాజు ఏటూరునాగారం : గోదావరి ముంపు బాధితులకు అండగా ఉంటామని మానవహక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు బాదావత్ రాజు అన్నారు. మండలంలోని రొయ్యూర్ బీట్ పరిధి కోడిపుంజుల అంగడి ప్రాంతాన్ని మంగళవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాసితులతో మా ట్లాడి భూమి విషయమై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నోఎళ్ల నుంచి గోదావరి ముం పుకు గురవుతుంటే ప్రభుత్వాలు ఎందుకు స్పందిం చడం లేదన్నారు. ప్రతి వర్షాకాలం వచ్చిం దంటే తట్ట, బుట్ట తలపై పెట్టుకొని పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాలు ఉండే మానసపల్లి తరుచూ ముంపుకు గురవుతుందన్నారు. వర్షాలు, వరదలు వచ్చి ముంపు గురవుతున్నా .. ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదన్నారు. నిరుపేదలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు .రొయ్యూర్ బీట్ పరిధిలోని 34 ఎకరాల భూమిని పేదలకు కేటాయించి స్థిరనివాసాలు ఏర్పాటు చేయాలన్నారు. ఫారెస్టు అధికారుల దాడులు ఆపాలన్నారు. కార్యక్రమంలో మానవ హక్కులవేదిక ప్రధాన కార్యదర్శి అద్దెనూరి యాదగిరి, ఉపాధ్యక్షులు హరికృష్ణ, వీవీ నారాయణ, సభ్యులు ప్రసాద్, లవకుమార్, శ్రీనివాస్, దిలీప్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.