మెరుపు సమ్మెకు రెడీ
కాకినాడసిటీ, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే, మరుక్షణం మెరుపు సమ్మెకు దిగేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులే కాకుండా సకలజనులు సమ్మెబాట పట్టేలా కార్యాచరణ రూపొందించాలని సంఘాల నేతలు భావిస్తున్నారు. అన్ని సెక్టార్లలో దశలవారీగా పాలనా కార్యకలాపాలను స్తంభింపజేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చేపట్టే ఈ రెండో దఫా నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం నుంచి ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు ప్రారంభిస్తున్నారు. ఏడో తేదీన గుంటూరులో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ, ప్రత్యక్ష పోరాట స్వరూపం నిర్ణయించనున్నారు. ఉద్యమ కార్యచరణపై సమైక్యరాష్ర్ట పరిరక్షణ వేదిక జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట దీక్షా శిబిరం వద్ద సమైక్యవాదుల సమావేశం జరిగింది.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో సమైక్యవాదులందరూ భావితరాల శ్రేయస్సు కోసం మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలని సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ పిలుపునిచ్చింది. పాలకుల తీరుపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. సమైక్యాంధ్ర రక్షణకు మెరుపు సమ్మెకు వెళ్లాలని సమావేశంలో తీర్మానించారు. జేఏసీ జిల్లా చైర్మన్ బూరి గ ఆశీర్వాదం, కన్వీనర్ పితాని త్రినాథ్ మాట్లాడుతూ సమైక్యవాదులు, సకలజనులు చిత్తశుద్ధితో ఈ ఉద్యమానికి కలసిరావాలన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే సమైక్యరాష్ర్ట పరిరక్షణ వేదిక రాష్ట్ర చైర్మన్ అశోక్‌బాబు రాజీనామా చేస్తానన్నారని, అలాగే జిల్లా నుంచి తాను కూడా రాజీనామా చేస్తానని ఆశీర్వాదం ప్రకటించారు. జేఏసీ నాయకులు గ్రంధి బాబ్జి, దంటు సూర్యారావు, జవహర్‌ఆలీ, అనిల్ జాన్సన్, టి.మాధవి, రామ్మెహన్, జియావుద్దీన్, మురళి, వివిధ సెక్టార్ల ప్రతినిధులు పాల్గొన్నారు.