మరోసారి బరిలో సైదిరెడ్డి.. హుజూర్నగర్లో ఉత్కంఠత!
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2007లో ఏర్పడింది. 2009, 2014, 18లో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అయితే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన నల్లగొండ ఎంపీగా పోటీ చేసి గెలవడంతో హుజూర్ నగర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణిని బరిలో దించారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి చేతిలో ఆమె ఓటమిపాలైంది. ఈసారి జరిగే పోరు మాత్రం రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.
ప్రధానంగా ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో డబ్బే కీలక పాత్ర పోషించనుంది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన నేతలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం అయిన నేపథ్యంలో గెలిచేందుకు ధన ప్రవాహం కొనసాగించే అవకాశం ఉంది. దీనికి తోడు అభివృద్ధి, ప్రతిపక్షాలు చేస్తున్న భూ ఆక్రమణలు కూడా భూమిక పోషించనున్నాయి.
ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న నేతలు:
ఈ నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ఉండనుంది. బీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి మరోసారి పోటీ చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గట్టు శ్రీకాంత్ రెడ్డితో పాటు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి రేసులో ఉన్నారు.
వృత్తిపరంగా ఓటర్లు
ఇక్కడ రైతులతో పాటు సిమెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు అధికంగా ఉంటారు. రాష్ట్రంలోనే అత్యధిక సిమెంట్ పరిశ్రమలు ఉన్న నియోజకవర్గాల్లో హుజూర్ నగర్ ఒకటి. ఇక్కడ ఉన్న పరిశ్రమల్లో వేలాది మంది యువత ఉపాధి పొందుతున్నారు.
కులం పరంగా ఓటర్లు :
ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గపు ఓటర్లే అధికంగా ఉంటారు. ఆ తర్వాత ఎస్టీ లంబాడీ వర్గానికి చెందిన ఓటర్లు ఉంటారు. రెడ్డి సామాజిక వర్గానికి 27712 మంది, లంబాడీ 26039, గౌడ 16838, యాదవ16530, మున్నురుకాపు 13173, ముదిరాజ్ 13228, కమ్మ 11071 మంది ఉంటారు.
నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు:
ఈ నియోజకవర్గం నుంచి సాగర్ ఎడమ కాలువ పయనిస్తుంది. సాగర్ ఆయకట్టు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉంటుంది. దీనికి తోడు అత్యధిక సిమెంట్ పరిశ్రమలకు అడ్డగా ఉంది. మరోవైపు కృష్ణపట్టే ప్రాంతం ఉంటుంది. ఇక రంగురాళ్లు ఎక్కువగా లభిస్తాయన్న ప్రచారం సైతం ఉంది.
నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు..
చారిత్రక మఠంపల్లి స్వయంభూ లక్ష్మీనారసింహస్వామి కొలువై ఉన్న ప్రాంతం. మేళ్ల చెరువులో ఉన్న శివాలయానికి రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు వస్తారు. నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇది ఆంధ్రా ప్రాంతానికి సరిహద్దులో ఉంది. ఇక్కడి నుంచి రెండు రాష్ట్రాల ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు.