రైళ్లలో ‘పొదుపు’ రుచులు
► ఈ కేటరింగ్‌లో స్వయం సహాయక సంఘాలకు అవకాశం
► మహిళా గ్రూపులకు ఐఆర్సీటీసీ ఆహ్వానం
► ఈ కేటరింగ్ ద్వారా ప్రయాణికులకు చిరుతిళ్లు
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులకు రుచికరమైన, నాణ్యమైన ఆహార పదార్ధాలను అందజేసేందుకు గాను ఐఆర్సీటీసీ సరికొత్త పంధాను ఎంచుకుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్టణంలో ప్రారంభించిన ఈ విధానాన్ని నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలో అందుబాటులోకి తెచ్చేందుకు ఆసక్తి గల మహిళా స్వయం సహాయక సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ఫ్ వంటి సంస్థల్లో నమోదై ఉండి ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న స్వయం సహాయక సంఘాలకు ఉపాధిని కల్పించడంతో పాటు, ప్రయాణికులకు రుచికరమైన ఆహార పదార్ధాలను అందజేసేందుకు ఐఆర్‌సీటీకి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం విజయవాడ, విశాఖ నగరాల్లో ఈ పద్ధతి విజయవంతం కావడంతో హైదరాబాద్‌లోని మహిళా సంఘాలను కూడా భాగస్వాములను చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే చిరుతిళ్లు త యారు చేసి విక్రయిస్తున్న మహిళా గ్రూపులు, లేదా తయారు చేసేందుకు సంసిద్ధంగా ఉన్న గ్రూపులు ఐఆర్సీటీసీలో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
ఐఆర్సీటీసీ ఆన్లైన్లో నమోదు...
అరిశెలు, జంతికలు, సున్నుండలు, పూతరేకులు, హైదరాబాద్ బిరియానీ, తెలంగాణ సర్వపిండి, చక్కిలాలు, మురుకులు వంటి రకరకాల పిండివంటలు, ఆహార పదార్ధాలు తయారు చేసే సంఘాలు ఐఆర్సీటీసీలో తమ వివరాలను నమోదు చేసుకొంటే చాలు. ఐఆర్సీటీసీ నిర్వహించే ఈ -కేటరింగ్‌లో ఆహార పదార్ధాల మెనూ సిద్ధం చేసి పెడుతుంది. ప్రయాణికులు తమ ప్రయాణంతో పాటే ఆహార పదార్ధాలను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఆహారపదార్ధాలపై వచ్చిన డబ్బులను ఐఆర్సీటీసీ సదరు మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేస్తుంది.
మహిళా సంఘాలు తమ వస్తువులను తాము నిర్ణయించిన ధరలకే విక్రయించవచ్చు. ప్రయాణికులు, మహిళా గ్రూపుల వంటలకు మధ్య ఐఆర్సీటీసీ ఒక ఆన్లైన్ మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తుంది. ఆసక్తి గల మహిళా సంఘాలు నేరుగా తమ ఉత్పత్తులను రైళ్లలో విక్రయించుకోవచ్చునని,(క్యాష్ ఆన్ డెలివరీ) ఆ సదుపాయాన్ని కూడా ఐఆర్సీటీసీ కల్పిస్తుందని సంస్థ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. పిండివంటలతో పాటు పచ్చళ్లు, తేనె వంటి వాటిని కూడా మహిళా సంఘాలు విక్రయించవచ్చు. ఆసక్తి ఉన్న మహిళా సంఘాలు సికింద్రాబాద్‌లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
అన్ని ఎ, ఎ-1 స్టేషన్లలో ఈ-కేటరింగ్ సేవలు...
ప్రస్తుతం విజయవాడ, విశాఖలో మాత్రమే అమలులో ఉన్న ఈ విధానాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని ఏ, ఏ-1 కేటగిరీ రైల్వేస్టేషన్లలో విస్తరించాలని ఐఆర్ సీటీసీ లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరంలోని మూడు ప్రధాన స్టేషన్ల ద్వారా కూడా ప్రయాణికులకు ఈ తరహా ఆహార పదార్ధాలను అందజేయడంపై అధికారులు దృష్టి సారించారు. డామినోస్, కేఎఫ్‌సీ, హలో కర్రీస్, సందర్శిని, బీమాలకు చెందిన వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్‌తో పాటు ప్రయాణికులు ఈ సంప్రదాయ వంటలను కూడా రుచి చూడవచ్చు.