నిబద్ధతకు ప్రశంస
ఒంగోలు క్రైం:
కృష్ణా పుష్కరాల సందర్భంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించిన 1,850 మంది పోలీసులకు గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ ప్రశంస పత్రాలు అందించారు. ఈ మేరకు స్థానిక పోలీస్ కల్యాణ మండపంలో శుక్రవారం రాత్రి జరిగిన అభినందన సభకు ఐజీ ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణ పుష్కరాల్లో జిల్లా పోలీసులు కూడా నిబద్ధతతో విధులు నిర్వర్తించారని కొనియాడారు.
హోంగార్డు మొదలుకొని ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా పనిచేశారన్నారు. పోలీసులతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు కూడా బాగా పనిచేశారని కీర్తించారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనుకోవాలంటే ఆయా కాలేజీల నుంచి కోరితే అలాంటి వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున ప్రత్యేకంగా అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ మాట్లాడుతూ జిల్లాలో పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్కు ఎలాంటా ఆటంకాలు కలుగకుండా సిబ్బంది పనిచేశార న్నారు. ఎవరికి అప్పగించిన విధులు వారు నిర్వర్తించటంలో నిమగ్నమై సాధారణ ప్రయాణీకులతో పాటు పుష్కర భక్తులకు అసౌకర్యం లేకుండా చేశారని కొనియాడారు. ఓఎస్డి అడ్మిన్ ఏ.దేవదానం, మార్కాపురం ఓఎస్డి కె.లావణ్య లక్ష్మి, ఎన్ఎస్ఎస్ అధికారి సుబ్బారావు, ఎన్సీసీ లెఫ్ట్నెంట్ కల్నల్ అబ్దుల్ రహీం, డీఎస్సీలు, సీఐ, ఎస్సై, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పోలీసులు పాల్గొన్నారు.