నూటికి నూరు విజేతలు వీరు
‘వందకు వంద మార్కులు తెచ్చుకున్నాడు మా అబ్బాయి’. ఈ మాట అంటున్నది ఒకటో తరగతి విద్యార్థి తల్లి కాదు. ప్రతిష్టాత్మకమైన ఐఐఎమ్ విద్యాసంస్థలో మేనేజ్మెంట్ కోర్సుల్లో అడుగుపెడుతున్న ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు. ఎలా చదివితే ఇది సాధ్యమవుతుంది?... ఇది వేలాది తల్లిదండ్రుల మెదళ్లను తొలిచే ప్రశ్న. ‘మా అబ్బాయికి లెక్కల్లో మెళకువలు నేర్పాను’ అంటారు సూర్యతేజ తండ్రి సాయిరామకృష్ణ. ‘క్లాసులో ఫస్ట్ రావాలని చెప్పను, అయితే ఫస్ట్ రాగలిగిన సమర్థత నీలో ఉన్నప్పుడు దానిని ఉపయోగ పెట్టకపోతే అది నీ తప్పు. ఆ పొరపాటు చదువులోనే కాదు, జీవితంలో కూడా చేయరాదు’ అని మార్గదర్శనం చేశానంటారు మరో విద్యార్థి పిల్లుట్ల కృష్ణ తండ్రి విశ్వనాథం.
సక్సెస్‌కు ఒకటి కాదు, వందలాది దారులు. ఏ దారిలో వెళ్లామనేది కాదు, గమ్యం చేరడమే లక్ష్యం... అని విజేతలు నిరూపిస్తూనే ఉంటారు. తాజాగా ఇటీవల వెలువడిన కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో శిఖరాగ్రాన నిలిచిన విజేతలలో మనవాళ్లు నలుగురున్నారు. వారిలో సూర్యతేజ, కృష్ణ ఇద్దరూ పరస్పరం భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లు. సూర్యతేజ తండ్రి సామర్లకోట ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టారు. కృష్ణ తండ్రి విశ్వనాథం ప్రఖ్యాత విద్యాసంస్థల స్థాపకులు. వీరిద్దరూ తమ పిల్లలకు ‘వింటి నుంచి వదలిన బాణంలా’ దూసుకెళ్ల గలిగిన నైపుణ్యాన్ని నేర్పించారు.
అవధానమే సోపానం!
‘నిజాయితీగా ఉండడం, సూటిగా మాట్లాడడం, అబద్ధం ఆడకపోవడం వంటి విలువలను నేర్పించాను. ఇంట్లో అందరం రామకృష్ణ పరమహంస బోధనలను అనుసరిస్తాం. ఆ ప్రభావం మా పిల్లల మీద ఉంది. మా వారు గణితావధానం చేస్తారు. ఒకసారి వేదిక మీద ‘అవధానం చేయడం అసాధ్యం కాదు, ఆసక్తి ఉన్న వాళ్లను అవధానిగా తీర్చిదిద్దగలను’ అన్నారు. అప్పటికి సూర్యతేజ ఎయిత్క్లాసులో ఉన్నాడు. ‘మన ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు. వేదిక మీద చెప్పిన దానిని ఆచరించి చూపండి’ అన్నాను. అన్నట్లుగానే నేర్పించారాయన. తేజ చిన్నప్పుడు అవధానం చేశాడు. చిన్నబ్బాయి అభిషేక్ అవధానం చేయలేదు కానీ ఆ ప్రక్రియ నేర్చుకున్నాడు. ఇప్పుడు తాను చెన్నైలో టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అవధాన ప్రక్రియ... లెక్కల్లో మెళకువలు తెలుసుకోవడానికి దోహదం చేసింది. పిల్లలకు మాథ్స్ పరీక్ష కోసం ప్రిపేర్ కావాల్సిన అవసరం రాలేదు.
- గంగా భవాని, సూర్యతేజ తల్లి
నీ హండ్రెడ్ పర్సెంట్...
‘‘ఈ తరం పిల్లలు పెద్దవాళ్లు ఏది చెబితే దానిని యథాతథంగా అనుసరించడం లేదు. ప్రతి విషయాన్నీ ‘ఎందుకు’ అంటారు. అలా ఎందుకు చేయాలో చెప్పాలి. మా అబ్బాయి కృష్ణ ఐఐటి బాంబేలో బీటెక్ చదువుతూ క్యాట్‌కు ప్రిపేరయ్యాడు. బీటెక్ తర్వాత ఏ కోర్సు చదవాలనే డిస్కషన్ వచ్చినప్పుడు... ఉన్న ఆప్షన్లు ఏమిటి, వాటిలో పాజిటివ్‌లు, నెగెటివ్‌లను నా అనుభవాన్ని బట్టి విశ్లేషించి చెప్పాను. తుదినిర్ణయం దగ్గర ఎవరమూ జోక్యం చేసుకోలేదు. నేను పిల్లలకు చిన్నప్పటి నుంచి చెప్పిందల్లా... దేవుడు తెలివితేటలు ఇచ్చాడు. వాటిని సద్వినియోగం చేయగల శక్తిసామర్థ్యాలనూ ఇచ్చాడు. మేధ, సామర్థ్యాలను ఉపయోగించడం మన బాధ్యత, ఉపయోగపెట్టలేకపోతే అది అసమర్థత. క్లాసులో ఫస్ట్ రావడం నీ లక్ష్యం కావాలనుకోవద్దు, నీ శక్తిసామర్థ్యాలను నూటికి నూరుశాతం ఉపయోగించుకోమని చెప్పేవాడిని. పరీక్షలకు ప్రిపేరయ్యేటప్పుడు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే విసుక్కోకుండా వాళ్ల డౌట్స్ క్లియర్ చేయడం అలవాటు చేశాం. అది కూడా తనకు ఉపయోగపడింది’’.
- విశ్వనాథం, కృష్ణ తండ్రి
సరైన దిశానిర్దేశం ఉంటే గమ్యాన్ని చేరడం సులువవుతుంది. చక్కటి నైపుణ్యంతో మెరుగులు దిద్దితే వజ్రం కాంతులీనుతుంది. ఎంత చక్కటి పథనిర్దేశకులు ఉన్నా, ఎంతటి నిపుణులు శిక్షణ ఇచ్చినా లక్ష్యాన్ని చేరాలనే తపన లేకపోతే ఎవరూ ఎవరినీ అందలం ఎక్కించలేరు. చక్కటి గెడైన్స్... కెరీర్లో దూసుకుపోవాలనే ఆకాంక్ష ఉన్న వాళ్లకు చుక్కానిలా పనిచేస్తుంది.
- వాకా మంజులారెడ్డి