ఎయిర్‌పోర్టుల్లో వాటాలు విక్రయించనున్న జీవీకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవీకే గ్రూప్ నిర్వహిస్తున్న ముంబై, బెంగళూరు అంత ర్జాతీయ విమానాశ్రయాలలో వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. ఈ విమానాశ్రయాల్లో వ్యూహాత్మక వాటాలను చేజిక్కించుకోవడానికి ఐదు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు జీవీకే ఇన్ఫ్రా డెరైక్టర్ (ఫైనాన్స్) ఇసాక్ జార్జ్ తెలిపారు. కంపెనీ విలువను బట్టి 25 నుంచి 35 శాతంవరకు వాటాలను విక్రయించే యోచనలో ఉన్నామని, దీని ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించవచ్చని తెలిపారు.
తగ్గిన నష్టాలు: కాగా తొలి క్వార్టర్లో కంపెనీ రూ.30.59 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.64.30 కోట్ల నష్టాలను ప్రకటించింది. మొత్తం ఆదాయం 14 శాతం క్షీణించి రూ.818 కోట్ల నుంచి రూ.699 కోట్లకు తగ్గింది. విద్యుత్ వ్యాపారం, విమానాశ్రయ ఆదాయం తగ్గడం దీనికి కారణమని పేర్కొంది.