ఐఐటీలో 30 శాతం ప్రశ్నలు ఈజీ!
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ... ప్రతిష్టాత్మకమైన ఈ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్రం నుంచే ఏటా అత్యధిక మంది అర్హత సాధిస్తున్నారు. అయినా ఇప్పటికీ లక్షల మంది విద్యార్థులకు ఐఐటీ అంటే బ్రహ్మ పదార్థమే. రూ. లక్షలు కోచింగ్‌కు వెచ్చించిన వారికే ఐఐటీల్లో సీటు వస్తుందన్న అపోహతో దాని వైపు కన్నెత్తి కూడా చూడని విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అయితే, 2013లో ఐఐటీ ప్రవేశ పరీక్ష అయిన ‘జేఈఈ-అడ్వాన్స్డ్’ నిర్వహించిన జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే.. ప్రభుత్వ కళాశాలల్లో చదివే సాధారణ విద్యార్థులు సైతం ఈ పరీక్ష రాయొచ్చనే నమ్మకం కలుగుతుంది.
ఐఐటీ ప్రశ్నపత్రం రూపొందించే నిపుణులకు స్పష్టమైన నిబంధన ఉందని, దాని ప్రకారం ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షలకు చక్కగా ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులెవరైనా సమాధానం ఇచ్చేలా ఐఐటీ ప్రవేశ పరీక్షలో 30% ప్రశ్నలు ఉంటాయని ఈ నివేదికలో వివరించింది. అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే 2013 ఐఐటీ ప్రవేశ పరీక్షలో కాఠిన్యత కొంత తగ్గిందని పేర్కొంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ బోర్డు అత్యంత ప్రతిభావంతులైన అధ్యాపకులతో బోధన కల్పిస్తున్నప్పటికీ.. ఎంసెట్, జేఈఈ-మెయిన్స్, జేఈఈ-అడ్వాన్స్డ్ తదితర ప్రవేశ పరీక్షలపై అవగాహన కల్పించడం లేదు. దీంతో విద్యార్థులు ఈ పరీక్షలకు దూరంగా ఉండిపోతున్నారు. ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఇకపై 30% ప్రశ్నలు బోర్డు పరీక్షల్లో వచ్చే సులభ ప్రశ్నలే ఉంటున్నందున విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
126కు పైగా వస్తే సరి: 2013 ఐఐటీ ప్రవేశ పరీక్షలో కామన్ మెరిట్ లిస్ట్(సీఎంఎల్)లో నిలిచిన అభ్యర్థులు మొత్తం 360 మార్కులకుగాను 332-126 మధ్య సాధించిన వారు ఉన్నారు. అంటే సీఎంఎల్లో కటాఫ్ 126 మార్కులే. తొలి ర్యాంకర్ 332 మార్కులు సాధించగా.. 300 మార్కులకు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు 23 మంది మాత్రమే. ఇక 250 మార్కులపైన సాధించిన అభ్యర్థులు 326 మంది మాత్రమే కావడం గమనార్హం. ఓబీసీ జాబితాలో తొలి మార్కు 314 కాగా.. కటాఫ్ మార్కు 113గా ఉందని జేఏబీ తెలిపింది.
అలాగే ఎస్సీ కేటగిరీలో తొలి మార్కు 279 కాగా.. కటాఫ్ మార్కు 63 అని, ఎస్టీ విభాగంలో తొలి మార్కు 257గా, కటాఫ్ మార్కు 63 అని పేర్కొంది. 30% ప్రశ్నలకు జవాబులు సరిగ్గా రాస్తేనే 120 మార్కులు సాధించవచ్చని, దీక్షతో ప్రయత్నిస్తే ఐఐటీ సీటు అసాధ్యమేమీ కాదని, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులూ ప్రయత్నించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఐఐటీ ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ-అడ్వాన్స్డ్ రాయాలంటే ముందుగా జేఈఈ-మెయిన్ పరీక్షలో తొలి 1,50,000 ర్యాంకర్లలో ఒకరిగా నిలవాలి. ఒకవేళ ఐఐటీ సీటు దక్కకపోయినా జేఈఈ-మెయిన్‌లో మంచి ర్యాంకు దక్కితే ఎన్ఐటీల్లో సీటు దక్కవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.