చిన్నమ్మకు కేసుల భయం
► అమ్మలేకున్నా చిన్నమ్మ శిక్షార్హులే
► స్పష్టం చేసిన న్యాయ నిపుణులు
► బాధ్యతలపై శశికళ మీనమేషాలు
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవులను అందుకునేందుకు తహతహలాడుతున్న శశికళను ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల భయం పట్టుకున్నట్లు సమాచారం. అప్పీలు కేసులో ప్రతికూలంగా తీర్పు వెలువడితే తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయగలదనే కారణంతోనే పార్టీ బాధ్యతలు చేపట్టడంపై ఆమె వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత తొలి ముద్దాయికాగా, శశికళ రెండో ముద్దాయిగా ఉన్నారు. ఇళవరసి, సుధాకరన్ మూడు, నాలుగో ముద్దాయిలుగా ఉన్నారు. చెన్నై, బెంగళూరుల్లో 18 ఏళ్ల పాటూ సాగిన ఈ కేసులో జయకు రూ.100 కోట్ల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష పడింది. శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు తలా రూ.10 కోట్లు జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు 2014లో తీర్పు చెప్పింది. కొన్నిరోజులు జైలు జీవితం గడిపిన తరువాత బెయిల్‌పై బైటకు వచ్చి బెంగళూరు హైకోర్టులో అప్పీలు చేసి వీరంతా నిర్దోషులుగా బైటపడ్డారు. నలుగురిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది, డీఎంకేలు వేర్వేరుగా సుప్రీంకోర్టులో అప్పీలు చేశాయి. ఈ అప్పీలు కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉంది. తేదీ ప్రకటించకుండా వాయిదా వేశారు.
శశికళ ప్రోద్బలం వల్లనే జయలలిత అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరు కోర్టు న్యాయమూర్తి గున్హ ఇచ్చిన తీర్పు ప్రకారం నలుగురూ దోషులే. అవినీతి నిరోధక చట్టం కింద జయపై కేసు నమోదై ఉంది. ప్రభుత్వ బాధ్యతల్లో ఉన్నవారే ఈ చట్టం కింద శిక్షార్హులు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున జయకు ఈ చట్టం వర్తిస్తుంది, కానీ శశికళకు వర్తించదే వాదనను పార్టీ లేవనెత్తుతోంది. అయితే, అవినీతికి ప్రోత్సహించారని ఆరోపిస్తూ శశికళపై ఐపీసీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ఉన్నారని, ఈ చట్టం కిందనే వారికి శిక్ష విధిస్తూ బెంగళూరు కోర్టు తీర్పు చెప్పిందని న్యాయనిపుణులు గుర్తు చేస్తున్నారు. న్యాయమూర్తి గున్హ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన పక్షంలో శశికళ సహా ముగ్గురు జైలు కెళ్లక తప్పదని అంటున్నారు.
శశికళ మౌనముద్ర:
జయలలిత మరణించి రెండు వారాలు దాటింది. ముఖ్యమంత్రి పదవికి పన్నీర్‌సెల్వం నియామకం వెంటనే జరిగిపోయింది. మరి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి భర్తీపై అన్నాడీఎంకేలో ఎటువంటి ముందడుగు పడలేదు. శశికళకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా తీర్మానాలు చేస్తున్నారు. పార్టీలోనే కాదు సీఎం పదవిలో కూడా ∙కూర్చోవాలని మంత్రులు సైతం శశికళను ముక్తకంఠంతో కోరుతున్నారు. శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకునే నిమిత్తం ఈనెల 21వ తేదీన నిర్వహించాల్సిన పార్టీ సర్వసభ్య సమావేశాన్ని కారణాలు తెలుపకుండా నిరవధికంగా వాయిదావేశారు. పార్టీ, ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నా శశికళ ఇంత వరకు పెదవి విప్పలేదు. పార్టీలో ఇంతటి అనుకూల వాతావరణం ఉన్నా తన ఇష్టాయిష్టాలపై శశికళ ఇంతవరకు నోరు మెదపలేదు.
సుప్రీంకోర్టులో ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసే ఈ మౌనముద్రకు అసలు కారణమని పార్టీలోని ఓ వర్గం చెవులు కొరుక్కుంటోంది. శశికళ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టగానే ఎమ్మెల్యేలతో శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత (ముఖ్యమంత్రి)గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ముచ్చటగా మూడోసారి సీఎం పదవి నుంచి తప్పుకుంటారు. శశికళ సీఎం కుర్చీలో కూర్చోగానే సుప్రీంకోర్టులో ప్రతికూలంగా తీర్పు వెలువడిన పక్షంలో పన్నీర్ సెల్వంకే పగ్గాలు అప్పగించాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కారణాల వల్లనే బాధ్యతలు స్వీకరించేందుకు శశికళ మీనమేషాలు లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.