సంచలన తీర్పు.. ఆ మానవ మృగానికి 142 ఏళ్ల జైలు శిక్ష
తిరువనంతపురం: అత్యాచారం కేసులో కేరళలోని పతనంతిట్టా పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 10 ఏళ్ల చిన్నారిపై రెండేళ్లకుపైగా లైంగిక దాడికి పాల్పడిన 41 ఏళ్ల మానవ మృగానికి ఏకంగా 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దాంతో పాటు రూ.5 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే.. నిందితుడు మరో మూడేళ్లు జైలులో ఉండాలని పోక్సో న్యాయస్థానం స్పష్టం చేసింది. పోక్సో కేసులో ఓ వ్యక్తికి విధించిన గరిష్ఠ శిక్షగా అధికారులు తెలిపారు.
2019 నుంచి 2021 మధ్య రెండేళ్ల పాటు 10 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం, లైంగిక దాడికి పాల్పడినట్లు 2021, మార్చి 20న తిరువల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు నందన్ పీఆర్ అలియాస్ బాబు బాధితురాలి కుటుంబానికి దూరపు బంధువు, వారి ఇంటిలోనే ఉండటంతో ఈ విషయం బయటకు రాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి కోర్టులో నివేదిక సమర్పించారు.
‘బాధితుల తరఫున పోక్సో ప్రాసిక్యూటర్ అడ్వకేట్ జాసన్ మాథ్యూ వాదనలు వినిపించారు. సాక్షుల వాంగ్మూలం, మెడికల్ రికార్డులు, ఇతర ఆధారాలు ప్రాసిక్యూషన్కు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు.. తిరువల్ల పోలీస్ ఇన్స్పెక్టర్ హరిలాల్ కేసు దర్యాప్తు చేపట్టి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో నిందితుడికి మొత్తం 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది’ అని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ముగ్గురు స్నేహితుల లైంగిక దాడి.. 10 ఏళ్ల బాలుడు మృతి