వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత
అన్నవరం :
వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో పంచాయతీ సిబ్బంది ప్రొటోకాల్ పాటించకపోవడంతో వివాదం నెలకొంది. స్థానిక కొత్తపేట వద్ద రూ.23 లక్షలతో నిర్మించిన 90 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ట్యాంక్‌ను కాకినాడ ఎంపీ తోట నర్సింహం, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పంచాయతీ సిబ్బంది ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఫొటో, పేరు లేకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబుకు ఆహ్వానం పలుకుతూ పంచాయతీ సిబ్బంది ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
కానీ ఎమ్మెల్యే వరుపులకు ఫ్లెక్సీ ఏర్పాటు చేయలేదు. పంచాయతీ అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఆ పార్టీ శ్రేణులు పంచాయతీ కార్యదర్శి రామ శ్రీనివాస్‌ను నిలదీశారు. ఒక దశలో టీడీపీ, వైఎస్సార్‌కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ పరిస్థితి వచ్చింది. ఈ విషయంపై అధికారులు సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు కార్యకర్తలు పరిస్థితి వివరించారు. దీంతో ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడమేమిటని ప్రశ్నించారు.
ఒక దశలో ఆయన పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ లేని వ్యక్తులను కార్యక్రమానికి ఆహ్వానిస్తే తాను బహిష్కరిస్తానని హెచ్చరించారు. అన్నవరం ఎస్సై జగన్మోహన్, సిబ్బంది ఇరువర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో కార్యక్రమానికి వచ్చిన కాకినాడ ఎంపీ తోట నర్సింహం ముందే ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో ఆయన వారిని వారించారు. అనంతరం ఎంపీ సూచన మేరకు టీడీపీ నాయకులు వెనక్కి తగ్గారు. టీడీపీ నేత పర్వత సురేష్ స్వయంగా ఎమ్మెల్యే వరుపుల వద్దకు వెళ్లి ఆయనను కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. జరిగిన విషయాన్ని మర్చిపోవాలని కోరారు. ప్రొటోకాల్ లేని వారిని కార్యక్రమం వద్దకు అనుమతించరాదని ఎమ్మెల్యే అన్నారు. దానికి టీడీపీ నాయకులు అంగీకరించడంతో ఎమ్మెల్యే వరుపుల కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఎంపీ తోట, ఎమ్మెల్యే వరుపుల వాటర్‌ట్యాంక్‌ను ప్రారంభిం చారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, ఎంపీపీ బద్ది మణి, వైస్ ఎంపీపీ బి.సత్తిబాబు, సర్పంచ్ రాజాల గంగాభవాని పాల్గొన్నారు.
మూడు రోడ్లకు శంకుస్థాపన
అన్నవరంలోని జన్మభూమి రోడ్డు, సాయిబాబా ఆలయం నుంచి లోపలకు వెళ్లే రోడ్డు, కొత్తపేటలో మరో రోడ్డుకు ఎంపీ తోట నరసింహం శంకు స్థాపన చేశారు. అలాగే సత్యదేవుని నమూనా ఆలయం వరకు వాటర్ పైప్‌లైన్ పనులకు కూడా ఎంపీ తోట నరసింహం శంకుస్థాపన చేశారు.
ప్రొటోకాల్ వివాదంపై స్పీకర్‌కు ఫిర్యాదు
ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొంతమంది ప్రభుత్వ అధికారులు టీడీపీ తొత్తులుగా మారి ప్రొటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు విమర్శించారు. అలాంటి వారిపై తాను శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. గురువారం ఆయన అన్నవరంలో విలేకర్లతో మాట్లాడారు. అన్నవరం వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేనైన తనను ఆహ్వానించారని, కానీ పంచాయతీ కార్యదర్శి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన పేరులేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమమా అని ఆయన ప్రశ్నించారు. అధికారులు ప్రొటోకాల్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు.
ఎమ్మెల్యే వరుపుల వెంట పార్టీ యువజన విభాగం జాయింట్ సెక్రటరీ ముదునూరి మురళీ కృష్ణంరాజు, ఏలేశ్వరం మండల పార్టీ కన్వీనర్ గొల్లపల్లి బుజ్జి, పార్టీ నాయకులు వాసిరెడ్డి జమీలు, అన్నవరం ఎంపీటీసీ సభ్యులు బండారు సత్యగంగాభవానీ, అనుసూరి లక్ష్మి, అన్నవరం టౌన్ అధ్యక్షుడు రాయవరపు భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి అప్పారావు, సరమర్ల మధుబాబు, బండారు సురేష్, రాయి శ్రీనివాస్, పంచారయతీ వార్డు సభ్యులు ఈర్లు శ్రీనివాస్, నవుడు శ్రీను, వైఎస్సార్సీపీ నాయకులు బలువు రాంబాబు, దడాల సతీష్, బండారు అర్జునరావు, బొబ్బిలి వెంకన్న,పలివెల కొండలరావు, సింగంపల్లి రాము, రాజాన రామరాజు, కొల్లు చిన్నా, పూసర్ల వేంకట రత్నం, ధనలక్ష్మి, కొణతల విజయలక్ష్మి, షేక్ ఫాతిమా తదితరులు
పాల్గొన్నారు.