శ్రీవారి ఆదాయానికి ‘ఆన్లైన్’ గండి
టీటీడీకి తగ్గిన రూ.10 కోట్ల రాబడి
11 వేల టికెట్లకు రోజుకు 5,832 కొనుగోలు
65 రోజులలో 25 వేల మంది గైర్హాజరు
తిరుమలలో కరెంట్ బుకింగ్లేక భక్తుల అవస్థలు
తిరుమల: టీటీడీ ఆన్లైన్ టికెట్ల కేటాయింపు ఆలయ ఆదాయానికి గండిపడేలా చేస్తోంది. భక్తుల నుంచి డిమాండ్ ఉండే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల స్థానంలో ప్రవేశ పెట్టిన ఆన్లైన్ టికెట్లకు ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. రోజుకు 11 వేల టికెట్లు అందుబాటులో ఉంటే సరాసరిగా 5,832 మంది మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన వాటిని కరెంట్ బుకింగ్ కిందకూడా కేటాయించడంలేదు. దీంతో 65 రోజుల్లో టీటీడీకి రూ. 10 కోట్ల రాబడి తగ్గింది. మరో వైపు ఆన్‌లైన్‌పై అవగాహన లేని గ్రామీణులు, అప్పటికప్పుడు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. వ్యయప్రయాసలతో అందుబాటులోని మార్గాల ద్వారా దర్శనం చేసుకుంటున్నారు.
మొదట్లో టీటీడీకి రూ. 180 కోట్ల రాబడి
2010లో అప్పటి ఈవో, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్. కృష్ణారావు తిరుమలలో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ప్రవేశ పెట్టారు. ఇది చాలా విజయవంతంగా కొనసాగింది. ఇతర దర్శనాలతో సంబంధం లేకుం డానే రోజుకు కనీసం 15 వేల నుంచి 25 వేల మంది వరకు భక్తులు స్వామిని దర్శించుకునేవారు. దీనివల్ల టీటీడీకి రోజుకు కనీసం రూ. 50 లక్షలు, నెలకు రూ. 15 కోట్లు, ఏడాదికి రూ. 180 కోట్ల దాకా సమకూరేది. దీని స్థానంలో టీటీడీ ఆగస్టు 20వ తేదీ నుంచి రోజుకు 11వేల చొప్పున ఆన్లైన్ టికెట్లు విక్రయిస్తోంది. ఈనెల 24వ తేదీ వరకు గడిచిన 65 రోజుల్లో 7.15 లక్షల టికెట్లను అందుబాటులో ఉంచగా, కేవలం 3.53లక్షలు మాత్రమే బుక్ అయ్యాయి.
గైర్హాజరూ ఎక్కువే
ఒకవైపు తిరుమల కరెంట్ బుకింగ్ ద్వారా రూ. 300 టికెట్లను కొనుగోలు చేసేందుకు భక్తులు ఉత్సాహం చూపుతున్నారు. మరోవైపు ఇదే దర్శనానికి అన్‌లైన్‌లోకి మళ్లించటం వల్ల టికెట్లను కొనుగోలు చేసిన భక్తుల్లో ఇప్పటి వరకూ 25వేల మంది గైర్హాజరయ్యారు. అవే కరెంట్ బుకింగ్ కింద తిరుమలలో కేటాయిస్తే టీటీడీకి రూ. 75 లక్షల దాకా రాబడి వచ్చేది.
కరెంట్ బుకింగ్ రద్దు తప్పదంటున్న టీటీడీ
తిరుమలలో ఉన్న రూ. 300 కరెంట్ బుకింగ్‌ను ఈనెల 30 లేదా నవంబర్ మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో రద్దు చేయాలనే భావనలో టీటీడీ ఉంది.ఆన్లైన్ దర్శనంలో అనేక లోపాలున్నాయని ఫిర్యాదులున్నా.. దాన్ని పూర్తి స్థాయిలో అమలుకు టీటీడీ అధికారులు ముందుకు వెళుతున్నారు.