వామ్మో.. చలి
ఆదిలాబాద్ రిమ్స్/మంచిర్యాల రూరల్, న్యూస్లై న్ : జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ నెల 10న కనిష్ట ఉష్ణోగ్రత 14.4 డిగ్రీ సెల్సియస్ ఉండగా శనివారానికి 10 డిగ్రీలకు పడిపోయింది. ఉదయం పది గంటలకు ముందు, సాయంత్రం ఆరు తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. తప్పనిసరి వెళ్లాల్సిన సమయంలో రగ్గులు, బ్లాంకెట్లు, స్వెట్టర్లు, మఫ్లర్లు, జర్కిన్లు, చేతి తొడుగులను ధరించి పోతున్నారు. పగలు కూడా చలి తీవ్రత వదలడం లేదు. శీతల గాలులతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిర్మానుష్యంగా కూడళ్లు..
జిల్లా ప్రజలను చలి వణికిస్తుండడంతో సాయంత్రం ఆరు గంటలు దాటితే చాలు పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక గ్రామాల్లోనైతే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇదిలా ఉంటే.. రోజురోజుకూ పెరుగుతున్న చలి నుంచి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అస్తమ సంబంధిత వ్యాధుల నుంచి అప్రమత్తంగా ఉండాలంటున్నారు. చిన్న పిల్లలను ఎక్కువగా బయట తింపొద్దని చెబుతున్నారు.