స్టార్టప్‌ల కోసం ఎస్బీఐ ఇన్‌క్యూబ్ బ్రాంచ్
బెంగళూరు: స్టార్టప్‌ల కోసమే ప్రత్యేకంగా ‘ఎస్బీఐ ఇన్‌క్యూబ్’ పేరుతో ఒక బ్రాంచీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంగళూరులో గురువారం ప్రారంభించింది. దీంతో పాటు ఎక్స్‌క్లూజిఫ్ పేరుతో వెల్త్‌మేనేజ్‌మెంట్ సర్వీస్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నామని ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ఔత్సాహిక ఎంటర్ప్రెన్యూర్లకు సలహాపూర్వక సేవలను ఎస్బీఐ ఇన్‌క్యూబ్ సమకూరుస్తుందని వివరించారు.
ప్రారంభంలో ఎస్బీఐ ఇన్‌క్యూబ్ ఎలాంటి రుణాలివ్వదని స్పష్టం చేశారు. స్టార్టప్‌లకు ఆర్థిక నిర్వహణ సేవలందిస్తామని చెప్పారు. స్టార్టప్‌లకు పెట్టుబడులే ప్రధాన అవసరం కాదని, ఆర్థిక నిర్వహణ సలహాలు కీలకమని పేర్కొన్నారు. అందుకే వాటికి ఆర్థిక నిర్వహణ సేవలందిస్తామని వివరించారు. స్టార్టప్‌లు ఒక స్థాయి వ్యాపారాన్ని సాధించిన తర్వాతనే వాటికి రుణాలిస్తామని వివరించారు. ఈక్విటీ మార్కెట్ నుంచి స్టార్టప్‌లు నిధుల సమీకరణకు ప్రస్తుతం తమ బ్యాంక్ తోడ్పాటునందించదని పేర్కొన్నారు.
భిన్నంగా ఎక్స్‌క్లూజిఫ్
భారత్‌లో కుబేరుల సంఖ్య వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఎస్బీఐ ఎక్స్‌క్లూజిఫ్ వెల్త్‌మేనేజ్‌మెంట్ సర్వీస్‌ను అందిస్తున్నామని భట్టాచార్య పేర్కొన్నారు. ఖాతాదారుల బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ అవసరాల కోసం ఒక రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారని పేర్కొన్నారు.