మళ్లీ బాలీవుడ్లో?
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా ‘ఎం.ఎస్. ధోనీ’ పేరుతో హిందీలో ఓ చిత్రం తయారు కానుంది. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చేయనున్నారు. ఇందులో ఉన్న ఓ కీలక పాత్రను రామ్‌చరణ్ చేయనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ‘జంజీర్’ చిత్రం ద్వారా హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడైన చరణ్ మంచి అవకాశం వస్తే, మళ్లీ హిందీలో నటిస్తానని ఓ సందర్భంలో చెప్పారు.
అందుకని ఈ చిత్రానికి పచ్చజెండా ఊపి ఉంటారనే ఊహాగానాలున్నాయి. ఇటీవల ఓ సందర్భంలో ఈ చిత్రం తారాగణం గురించి ఓ విలేకరి నీరజ్ పాండేని అడిగితే.. ‘‘ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాం. ఇప్పుడే నేను పేర్లు ప్రకటించలేను’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ధోనీ భార్య సాక్షీ సింగ్ పాత్రను అలియా భట్ చేయనున్నారట.