భారత్-పాక్ మ్యాచ్: రాకెట్లా దూసుకుపోతున్న ఆ ధరలు
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఇరు దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే కోట్లాదిమంది అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంటోంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు దేశాలు ఫైనల్ మ్యాచ్ తలపడబోతున్నాయంటే ఆ అంచనాలే వేరుంటాయి. అభిమానుల అంచనాలు మాత్రమే కాదు, టెలివిజన్ ప్రకటన రేట్లు కూడా రాకెట్లలా దూసుకుపోతున్నాయి. దాయాది దేశాలకు మధ్య జరుగబోయే ఫైనల్ మ్యాచ్ కు టెలివిజన్ ప్రకటన ధరలు సాధారణ ధర కంటే 10 రెట్లు ఎక్కువకు పెంచాయని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి.
ఆదివారం జరిగే ఈ మ్యాచ్ విరామ సందర్భాల్లో వచ్చే ప్రకటనలకు 30 సెకన్లకే ఏకంగా కోటి రూపాయలు వసూలు చేస్తున్నాయని తెలిసింది. రూపర్ట్ ముర్డోచ్ స్టార్ స్పోర్ట్స్ లో 30 సెకన్ల గల ప్రకటన ఇవ్వాలంటే కోటి పైగా చెల్లిచాల్సిందేనట. అయితే సగటున ప్రకటనదారులు చెల్లించే మొత్తం 10 లక్షలు మాత్రమే ఉంటుందని ఇండస్ట్రి వర్గాలు తెలిపాయి. ఈ రేటు చాలా అత్యధికంగా ఉందని పేర్కొన్నాయి.
ఈ టోర్నమెంట్ కు నిస్సాన్ మోటార్, ఇంటెల్ కార్ప్, ఎమిరేట్స్, చైనీస్ మొబైల్ మేకర్ ఒప్పో, దేశీయ టైర్ల దిగ్గజం ఎంఆర్ఎఫ్ లు కమర్షియల్ పార్టనర్లుగా ఉన్నాయి. అయితే ముందస్తుగా బుక్ చేసుకున్న వారికంటే కూడా ప్రస్తుతం యాడ్స్ ఇవ్వాలనుకుంటే ఇంకా ఎక్కువగా చెల్లించాల్సి ఉందని ఓ వ్యక్తి చెప్పారు. 2007లో జరిగిన ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తలబడిన భారత్-పాక్.. పదేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి తలపడుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.