'సబ్ సే సస్తా' ఇక అందదా..?
న్యూఢిల్లీ: సబ్ సే సస్తా(చాలా చీప్) పేరుతో భారత మార్కెట్లోకి ప్రవేశించిన టెలినార్.. టెలికాం బిజినెస్ నుంచి వైదొలిగేందుకు సిద్ధమౌతోంది. కేవలం 2జీ సర్వీసులకే పరిమితమైన టెలినార్ మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోతోంది. ఐడియా సెల్యులార్, వొడాఫోన్ వంటి సంస్థలు 3జీ సర్వీసులు అందిస్తుండగా, రిలయన్స్ జియో కొత్తగా 4జీ సర్వీసులను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ మార్కెట్ పోటీని తట్టుకోలేని టెలినార్ భారత టెలికాం బిజినెస్ నుంచి వైదొలగడమే మంచిదని భావిస్తోంది.
నార్వే దేశానికి చెందిన ఈ కంపెనీ 2009లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఏడు సర్కిల్స్ లో స్పెక్ట్రమ్ కల్గి ఉన్న టెలినార్, ఆరు ప్రాంతాల నుంచి 1800 ఎమ్ హెచ్ జడ్ బ్యాండ్ తో సర్వీసులు అందిస్తోంది. రూ.11 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు భారత్ లో టెలినార్ కు బిజినెస్ ఉంది. 2008-09లో దాదాపు రూ.20 వేల కోట్లను భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన టెలినార్, ప్రతి ఏడాది చివరి క్వార్టర్ లో చేదు అనుభవాలనే ఎదుర్కొంటూ వస్తోంది. 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ ఫలితంగా 2012లో భారత్ లో లైసెన్సు లన్నింటినీ కోల్పోయింది. దీనిపై కంపెనీ పోరాడినప్పటికీ మరింత ముందుకు పోవడానికి సాహసించలేదు.
పోటీదారుడి ఒత్తిడి, నెట్ వర్క్ ఆధునీకరణపై అధిక పెట్టుబడులు టెలినార్ తట్టుకోలేక.. భారత్ మార్కెట్లో నిలదొక్కుకోవడం కష్టంగా భావిస్తోంది. భారత మార్కెట్ ను ఆకట్టుకోవాలంటే ఎక్కువగా ఆక్షన్ ట్రేడింగ్ పై ఎక్కువగా దృష్టిసారించాల్సి ఉంది. కానీ ఈ విషయంలో టెలినార్ విజయవంతమౌతుందనడంలో సందేహం నెలకొంది. 3జీ, 4జీ స్పెక్ట్రమ్ కొనుగోలులో టెలినార్ ఆసక్తి చూపకపోవడం, 2జీ సేవలకే పరిమితమవ్వడం వల్ల మార్కెట్ లో తక్కువ రాబడి షేరుగా టెలినార్ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. టెలినార్ కు వినియోగదారులు పడిపోవడానికి కారణం కూడా సరియైన డేటా సేవలు అందించకపోవడమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.