నరనరాన భారత వ్యతిరేకత
హురియత్ నేత సయ్యద్ అలీషా గిలానీకి వారసుడిగా పేరున్న కరడుగట్టిన వేర్పాటువాది మసరత్ఆలం(42) నరనరాన భారత వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి. ‘భారత వ్యతిరేకత ఆలం రక్తంలోనే ఉంది. 2008, 09, 10ల్లో జరిగిన హింసాత్మక ఘటనలు పునరావృతం కాకూడదంటే ఆలంను అరెస్ట్ చేయాల్సిందే’ అని 2014 లో శ్రీనగర్ డీసీపీ పేర్కొనడం ఆలం ఏ స్థాయి వేర్పాటువాద నేతో తేటతెల్లం చేస్తుంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆలం.. డిగ్రీవరకు చదివాడు. 1989 నాటి సాయుధ తిరుగుబాటును సమర్థించడంతో ఆయనను అరెస్ట్ చేసి..1996 వరకు జైల్లో ఉంచారు. పోలీసులు అదుపులోకి తీసుకోవడం వదిలేయడం పరిపాటిగా మారింది.కశ్మీర్ పాకిస్తాన్లో విలీనం కావాలనే ముస్లింలీగ్ పార్టీలో ఆలం చేరారు.
క్విట్ కశ్మీర్.. గో ఇండియా గో!
ఆలం 2008లో అరస్టై 2010 వరకు జైల్లో ఉన్నాడు. విడుదలయ్యే సమయానికి కశ్మీర్ అల్లర్లతో అట్టుడుకుతూ ఉండేది. ఆలం ‘క్విట్ కశ్మీర్’ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ‘భారత్ కో దే రగ్డా’ అనే భారత వ్యతిరేక గేయాన్ని, ‘గో ఇండియా గో’ నినాదాన్ని ప్రచారం చేశాడు. వారంలో ఏ రోజు ఏ ఆందోళన చేయాలో తెలిపే కేలండర్ రూపొందించాడు. వీధుల్లో నిరసనలు, సాయుధ బలగాలపై రాళ్ల దాడులు తదితర వ్యూహాల్తో వేర్పాటువాదుల్లో పాపులారిటీ సంపాదించాడు. అతికష్టం మీద 2010 అక్టోబర్లో పోలీసులు ఆయనను మళ్లీ అరెస్ట్ చేశారు. ఆలం దాదాపు 17 ఏళ్లు కటకటాల్లోనే గడిపాడు.