విద్యార్థులను రోబోలుగా మార్చకండి
► మానవ విలువలు పెంపొందించండి
►ప్రధానోపాధ్యాయులకు గవర్నర్ సూచన
హైదరాబాద్: ‘ర్యాంకుల పందెంలో పరిగెడుతూ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను రోబోల్లా మార్చేస్తున్నాయి. దేశ భవిష్యత్తుకు ఇది మంచిది కాదు. వారిలో మానవ విలువలను పెంపొందించండి. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయండి’అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పబ్లిక్ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. సోమవారం ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రారంభమైన ఈ మూడు రోజుల సదస్సులో గవర్నర్... ప్రస్తుత విద్యా వ్యవస్థ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులతో విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి నశించిపోతుందన్నారు.
సంస్కారానికి దూరం చేస్తోంది: ‘నేటి విద్యా వ్యవస్థ సంస్కారానికి విద్యార్థులను దూరం చేస్తోంది. నమస్కారం నుంచి హాయ్ అనే సంస్కృతి పెరిగిపోయి, విలువలు అంతరించిపోతున్నాయి. తల్లిదండ్రులు ఉద్యోగ, ఇతరత్రా పనులపై బిజీ అయిన నేపథ్యంలో పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించాల్సిన బాధ్యత గురువులదే. పాఠశాలలు విద్యార్థులను మిషిన్లుగా తయారుచేస్తూ, మానవ విలువలను చంపేస్తున్నాయి. విలువలు చంపే పోటీ వద్దు. విదేశీయులు భారతీయ సంస్కృతిని పొగుడుతుంటే.. మన పబ్లిక్ పాఠశాలలు పరదేశీ భాషలు, సంస్కృతిని నూరిపోయడం సరికాదు’ అని గవర్నర్ అన్నారు.
పిల్లలతో మాట్లాడే సమయం లేదు: తల్లిదండ్రులు తమ పిల్లలకు మాట్లాడే సమయం కూడా ఇవ్వడం లేదని, ఎస్ఎంఎస్లతోనే సరిపెట్టేయడం ద్వారా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని గవర్నర్ అన్నారు. విజయానికి షార్ట్‌కట్స్ లేవనే విషయాన్ని విద్యార్థులకు వివరించి, ఉపాధ్యాయులు రోల్‌మోడల్‌గా నిలవాలన్నారు. ఐపీఎస్సీ చైర్మన్ వీకే బంగా, కార్యదర్శి ఏజే సింగ్ పాల్గొన్నారు.
మార్కులు ప్రామాణికం కాదు...
భారత్‌లోనే యోగా పుట్టిందని, అలాంటి యోగాప్రాముఖ్యతను విదేశీయులు గుర్తించి, వారి ద్వారా మనం తెలుసుకోవాల్సి రావడం దురదృష్టకరమని నరసింహన్ అన్నారు. భారతీయ సంస్కృతీవైభవాన్ని విద్యార్థులకు తెలియజెప్పాల్సిన బాధ్యత గురువులదేనన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించి వారి పట్ల గౌరవప్రదంగా నడుచుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని... సమాజం అంటే అందరం అని, దేశ ఉన్నతికి ఏవిధమైన సేవలు చేయాలో చిన్నారులకు తెలియజేయాల్సిన బాధ్యత గురువులదేనన్నారు. పాఠశాలల్లో కొద్దిమందికి వచ్చిన ర్యాంకులను ప్రచారం చేసుకోవడం సరికాదని, ప్రతిఒక్క విద్యార్థినీ ఉన్నత స్థానానికి చేర్చేలా పాఠశాల స్థాయిలోనే పునాది పడాలన్నారు. మార్కులు విద్యకు ప్రామాణికం కాదని, విద్యార్థుల అభిరుచులు, ప్రతిభ గుర్తించి ప్రోత్సహించడమే నిజమైన విద్యకు ప్రామాణికతన్నారు.