భారత్ ఫైనాన్షియల్... ఇండస్ఇండ్ చేతికి!
విలీన చర్చలపై మీడియాలో వార్తలు...
• రెండింటికీ ప్రయోజనమే అంటున్న విశ్లేషకులు
• గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణకి ఇండస్‌ఇండ్‌కు అవకాశం
• భారత్ ఫైనాన్షియల్‌కు తగ్గనున్న నిధుల సమీకరణ వ్యయాలు
ముంబై: మరో రెండు ఆర్థిక సంస్థల మధ్య విలీనం జరుగుతుందన్న అంచనాలు మార్కెట్లో మొదలయ్యాయి. ప్రైవేటు రంగ ఇండస్ఇండ్ బ్యాంక్‌లో నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (గతంలో ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్) విలీనమయ్యేందుకు చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ విలీన వార్తల నేపథ్యంలో ఈ డీల్ సాకారమైతే రెండు సంస్థలకు ప్రయోజనకరమే కాగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించేందుకు ఇండస్‌ఇండ్‌కు అవకాశం లభించగలదని వారు చెబుతున్నారు. అలాగే తక్కువ వడ్డీ భారంతో నిధులు సమీకరించుకోవడానికి భారత్ ఫైనాన్షియల్‌కు ఈ డీల్ తోడ్పడగలదని అంటున్నారు.
ప్రస్తుతం కర్ణాటకలోని బీదర్‌లో ఇండస్‌ఇండ్‌కు భారత్ ఫైనాన్షియల్ బిజినెస్ కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తోంది. ప్రాధాన్యతా రంగాలకిచ్చే రుణాల లక్ష్య సాధనలో ఇండస్‌ఇండ్‌కు ఈ భాగస్వామ్యం గణనీయంగా తోడ్పడుతోంది. ఇండస్ఇండ్తో భాగస్వామ్యం ద్వారా భారత్ ఫైనాన్షియల్ తమ ఖాతాదారులకు మైక్రో రికరింగ్ డిపాజిట్ల సదుపాయం కూడా కల్పిస్తోంది. భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (బీఎఫ్ఐ) చిన్న బ్యాంకు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆర్బీఐ నుంచి అనుమతులు రాలేదు.
ఇండస్ఇండ్ బ్యాంక్‌కు ప్రయోజనకారి..
సూక్ష్మ రుణాల సంస్థగా బీఎఫ్ఐకి గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా కార్యకలాపాలున్నాయి. దీంతో బీఎఫ్ఐ విలీనంతో ఇండస్‌ఇండ్‌కి గ్రామీణ ప్రాంతాల్లో చొచ్చుకుపోయేందుకు వీలు కలగనుంది. డిపాజిట్ల సేకరణతో పాటు రుణాల వితరణ ద్వారా ఖాతాదారుల సంఖ్యను పెంచుకోవడానికి తోడ్పాటు లభిస్తుంది. పైగా సేల్స్ సిబ్బందిపరంగా బీఎఫ్ఐకి గల పటిష్టమైన నెట్‌వర్క్‌తో ఇండస్‌ఇండ్‌కు లాభించగలదు. అదే సమయంలో ప్రాధాన్యతా రంగాల రుణాల (పీఎస్ఎల్) పోర్ట్‌ఫోలియో కూడా పెరగగలదు. తాజా నిబంధనల ప్రకారం పీఎస్ఎల్ సర్టిఫికెట్స్ విక్రయం ద్వారా ఇండస్ఇండ్ కొంత ఫీజు ఆదాయాలని కూడా పెంచుకోవచ్చని జేపీ మోర్గాన్ అనలిస్టులు పేర్కొన్నారు. మొండి బకాయిల ప్రక్షాళన వంటి కొన్ని రిస్కులు ఉన్నప్పటికీ.. మైక్రోఫైనాన్స్ రంగంలో అసెట్స్‌పై రాబడుల (ఆర్వోఏ) విషయంలో అత్యధిక వృద్ధి అవకాశాలు ఉండటం ఇండస్‌ఇండ్‌కు కలసి రాగలదని వివరించారు.
బ్యాంకింగ్ స్వరూపంలో ఇండస్ఇండ్ కన్నా బీఎఫ్ఐ.. ఆర్వోఏనే అధికంగా ఉండగలదన్నారు. మరోవైపు వచ్చే 3–4 ఏళ్లలో మైక్రోఫైనాన్స్ వ్యాపారాన్ని ప్రస్తుతమున్న రూ. 3,000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్ల స్థాయికి పెంచుకోవాలని భావిస్తున్నందున ఇండస్‌ఇండ్‌కు ఈ డీల్ ఉపయోగపడగలదని నొమురాకి చెందిన అనలిస్టు ఆదర్శ్ పారస్రాంపూరియా పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం పూర్తయితే.. విలీనానంతరం ఏర్పడే సంస్థలో మైక్రోఫైనాన్స్ రుణాల వాటా మూడు రెట్లు ఎగిసి తొమ్మిది శాతానికి చేరగలదని అంచనా.
బీఎఫ్ఐకి రాజకీయపరమైన రిస్కులు తగ్గుదల..
ఇక ఇండస్ఇండ్తో డీల్ సాకారమైతే భారత్ ఫైనాన్షియల్ నిధుల సమీకరణ వ్యయాలు తగ్గగలవు. ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లపై పరిమితుల సమస్య ఉండదు. అయితే, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) వంటివి పాటించాల్సి రావడం కొంత ప్రతికూలాంశం. కానీ, బీఎఫ్ఐకి ప్రస్తుతం 20–25% మేర లిక్విడ్ అసెట్స్ ఉండటం కాస్త కలిసొచ్చే అంశమని మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషకులు అల్పేశ్ మెహతా అభిప్రాయపడ్డారు. అలాగే రాజకీయపరమైన రిస్కులు కూడా దానికి తొలిగిపోగలవని ఆయన వివరించారు.