ఉత్తమ టీ20 బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ
ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో-2015 అవార్డులకు ఎంపికైన వారి పేర్లను ప్రకటించారు. అన్ని రకాల(వన్డే, టెస్ట్, టీ20) ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఈ అవార్డులు ఇస్తారు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో-2015 అవార్డులకుగానూ ప్రకటించిన వారిలో న్యూజిలాండ్ జట్టు నుంచి ముగ్గురు ఎంపికయ్యారు.
► భారత స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మను 'ఉత్తమ టీ20 బ్యాట్స్‌మెన్'గా ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో ధర్మశాలలో జరిగిన టీ20 మ్యాచ్‌లో రోహిత్ చేసిన 106 పరుగులకుగానూ ఈ అవార్డు అతన్ని వరించింది. రోహిత్ చేసిన డబుల్ సెంచరీలకుగానూ 2013, 2014 సంవత్సరాల్లో వన్డే విభాగంలో ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయిన విషయం తెలిసిందే.
► 30 ఏళ్ల కిందటి నుంచి వివ్ రిచర్డ్స్ పేరుమీదున్న ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ రికార్డు బ్రేక్ చేసిన మెక్కల్లంకు 'కెప్టెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది. న్యూజిలాండ్ జట్టును ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ వరకు చేర్చినందుకుగానూ 'కెప్టెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు అతన్ని వరించింది.
► ఆషెస్ సిరిస్‌లో 8 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను 60 పరుగులకే కుప్పకూలేలా కృషి చేసినందుకు గానూ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ను 'బెస్ట్ టెస్ట్ బౌలర్' అవార్డు వరించింది.
► వెల్లింగ్టన్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 242 పరుగులు చేసినందుకు 'బెస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్' అవార్డు ప్రస్తుత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వరించింది.
► జొహన్నస్ బర్గ్‌లో వెస్ట్ ఇండిస్తో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన ఏబీ డివిలియర్స్ 'వన్డే ఇన్నింగ్స్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది.
► వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లు తీసినందుకుగానూ సౌతీకి 'వన్డే బెస్ట్ బౌలింగ్' అవార్డు లభించింది. డేవిడ్ వీస్‌కు 'టీ20 బెస్ట్ బౌలర్' అవార్డుకు ఎంపికయ్యారు.