క్షేమంగా తీసుకొస్తాం!
ఇరాక్‌లో భారతీయ బందీలపై కేంద్రం
న్యూఢిల్లీ: ఇరాక్‌లోని మోసుల్‌లో అపహరణకు గురైన 39 మంది భారతీయులను సురక్షితంగా విడిపించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కిడ్నాప్‌నకు పాల్పడిందెవరో తెలిసిందని, వారి బారి నుంచి భారతీయులను విడిపించేందుకు ఇంటర్నేషనల్ రెడ్ క్రిసెంట్ సంస్థతోనూ, ఆ ప్రాంతంలోని ఇతర దేశాల వారితోనూ సంప్రదింపులు జరుపుతున్నామని స్పష్టం చేసింది. కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న వ్యక్తి కూడా క్షేమంగా ఉన్నాడని తెలిపింది. అలాగే, ఇరాక్‌లోని హింసాత్మక ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరినీ క్షేమంగా ఇండియాకు తీసుకొస్తామని పేర్కొంది. తామంతా ఇక్కడ ప్రమాదంలో ఉన్నామని, స్వదేశానికి తిరిగిరావాలనుకుంటున్నప్పటికీ.. తమ యజమాని పాస్‌పోర్ట్‌లు ఇవ్వడంలేదని నజాఫ్‌లో ఒక నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న భారతీయులు ఆమ్నెస్టీ సంస్థకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు.
వారితో పాటు వందలాదిగా భారతీయ కార్మికులు నజాఫ్‌లో చిక్కుకుపోయారని ఆమ్నెస్టీ తెలిపింది. సున్నీ మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న తిక్రిత్ పట్టణంలో చిక్కుకుపోయిన భారతీయ నర్సులు క్షేమంగా ఉన్నారని, వారితో అక్కడి అధికారులు మాట్లాడుతూనే ఉన్నారని అధికారులు చెప్పారు. ఇరాక్‌లోని భారతీయులు రోడ్డు మార్గం ద్వారా పొరుగుదేశాల్లోకి వెళ్లేందుకు సహకరించేలా ఆయా దేశాలతో సంప్రదింపులు జరపాలని భారత ప్రభుత్వం ఆయా దేశాల్లోని భారతీయ దౌత్యాధికారులను ఆదేశించింది. కాగా, ఇరాక్ నుంచి బయల్దేరిన ఆరుగురు పంజాబీలు శనివారం క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. మరోవైపు, ఇరాక్‌లో మిలిటెంట్ల దాడులు కొనసాగుతున్నాయి. సిరియా సరిహద్దుల్లోని కకీలక క్రాసింగ్‌ను ఇరాకీ దళాలతో హోరాహోరీ పోరు అనంతరం తిరుగుబాటు దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ పోరులో 30 మంది ఇరాక్ సైనికులు మరణించారని సమాచారం.