మ్యూజియం...ముందడుగు
► అంతర్జాతీయ సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు స్థలం కేటాయింపు
► టీటీడీ పాలక మండలి ఆమోదం
► మూడు సంవత్సరాల్లో మ్యూజియం పూర్తి చేయాలని లక్ష్యం
యూనివర్సిటీ క్యాంపస్: తిరుపతిలో అంతర్జాతీయ సైన్స్ మీడియం ఏర్పాటుకు ముందడుగు పడింది. ఈ మ్యూజియం ఏర్పాటుకు టీటీడీ 19 ఎకరాల 25 సెంట్ల స్థలాన్ని లీజు పద్ధతిలో ఇవ్వడానికి అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో జనవరి 3 నుంచి 7 వరకు 104వ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారు. ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా తిరుపతిలో అంతర్జాతీయ సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శ్రీవారి సాక్షిగా 7 గోళాల ఆకృతిలో మ్యూజియం నిర్మించాలని తీర్మానించారు. సుమారు 1300 కోట్ల నిర్మాణ వ్యయంతో దీనిని రూపొందించాలని నిర్ణయించారు.
దీనికి సంబంధించిన నిర్మాణ పనులకు జనవరి 4న సీఎం చంద్రబాబునాయుడు భూమిపూజ చేశారు. ఈ మ్యూజియంలో ఐటీ, శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, పౌల్ట్రీ, వ్యవసాయం, సెరికల్చర్, స్పేస్, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించిన బ్లాక్‌లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు.
వినోదాన్ని అందించే వీలుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేంద్ర రక్షణ శాఖ సాంకేతిక సలహాదారు సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన నమూనాను రూపొందించారు. మూడు సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. తాజాగా మంగళవారం జరిగిన పాలకమండలి సమావేశంలో సైన్స్‌మ్యూజియం ఏర్పాటుకు 19 ఎకరాల 25 సెంట్లు భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్థలం కేటాయింపుతో దీని నిర్మాణానికి ముందుడుగు పడినట్లయింది.