ఆస్తులు వెల్లడిస్తే పన్నులో మినహాయింపు
హిందూపురం అర్బన్ : అప్రకటిత ఆస్తులు, నల్లధనం వెల్లడితో ఆస్తిపన్నులో మినహాయింపులు ఉంటాయని హిందూపురం ఇన్కం ట్యాక్స్ ఆఫీసర్ సంజీవయ్య అన్నారు. స్థానిక ఇన్కం ట్యాక్స్ ఆఫీసులో హోల్సేల్, రిటైల్ క్లాత్ మర్చెంట్స్కు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్కం ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి వ్యాపారులకు ఆదాయ వెల్లడి పథకం 2016 గురించి వివరించారు. 2015–16 సంవత్సరంలో ఇన్కం ట్యాక్స్ రిటన్స్లో వెల్లడించకుండా గోప్యంగా ఉంచిన ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి దాఖలు చేస్తే పన్నులో 45 శాతం మినహాయింపు ఉంటుందన్నారు.
కర్నూలు డిప్యూటీ కమిషనర్ వద్ద ఆస్తుల డిక్లరేషన్ ఇస్తే 45 శాతం పన్నును మూడు విడతలుగా చెల్లించడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. చెల్లించని వారు అధికారులు దాడుల్లో దొరికితే 100 శాతం పన్నుతో పాటు 300 శాతం అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో క్లాత్ మర్చెంట్ సంఘం నాయకులు రాము, అశ్వర్థనారాయణ, షాహనావాజ్ పాల్గొన్నారు.