యాపిల్ ఐఫోన్లకు కష్టకాలమే..
ఐఫోన్లకు డిమాండ్ పడిపోతున్న నేపథ్యంలో యాపిల్ సంస్థకు కష్టకాలం ఏర్పడింది. అమ్మకాలు తక్కువగా నమోదు అవుతుండటంతో, ఐఫోన్ ఉత్పత్తుల తయారీని తగ్గించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొత్తగా మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ లేటెస్ట్ మోడల్ ఎస్ఈని కూడా యాపిల్ కు ఇప్పట్లో ఆవిష్కరించే ఉద్దేశాలు లేనట్లు నిక్కీ బిజినెస్ డైలీ తెలిపింది. అమ్మకాలు తగ్గిపోతుండడంతో ప్రస్తుతం యాపిల్ కంపెనీ షేర్లు 1.8 శాతానికి పడిపోయి 110.05 డాలర్లుగా నమోదవుతున్నాయి.
2013లో కూడా యాపిల్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. తక్కువ ధరలకు ఐఫోన్ 5సీ మోడళ్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చిన కొన్ని నెలలకి దాన్ని ఉత్పత్తుల తయారీని తగ్గించింది. ఇప్పటికే జపాన్, ఇతర ప్రాంతాల్లో ఈ త్రైమాసికంలో ఉత్పత్తులు తగ్గిస్తామని కంపెనీ తెలిపినట్టు నిక్కీ నివేదిక పేర్కొంది.
చివరి త్రైమాసికం మార్చిలో రాబడులు తగ్గుతాయని యాపిల్ జనవరిలోనే ప్రకటించింది. 13 ఏళ్లలో రాబడులు తగ్గుతాయని యాపిల్ ప్రకటించడం అదే మొదటిసారి. మందగమన చైనా మార్కెట్లో బలహీనపడే సంకేతాలు రావడమే ఈ రాబడులు పడిపోవడానికి కారణమని యాపిల్ పేర్కొంది.
ఈ క్రమంలోనే అతి పెద్ద టెక్నాలజీగా పేరున్న యాపిల్ మార్చి త్రైమాసికంలో ఐపోన్ 6ఎస్, ఐపోన్ 6ఎస్ ప్లస్ మోడళ్లను 30శాతం తగ్గించాలనుకుంది. కానీ ఉత్పత్తుల తయారీ సాధారణ స్థాయిలోనే ఉంది. ప్రస్తుతం భారత్ మార్కెట్లో ఐపోన్లు ఎదుర్కొంటున్న కష్టకాలంలో జూన్ త్రైమాసికం చివరి వరకు యాపిల్ ఉత్పత్తులను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది.