పన్నీరొకచోట... కన్నీరొకచోట!
ఆ నేడు 5 నవంబర్, 2006
ఇటు ఇరాక్, అటు అమెరికాలతో పాటు యావత్ ప్రపంచం సద్దాంపై వచ్చే తీర్పు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సద్దాంకు అనుకూలంగా ఒకవైపు, వ్యతిరేకంగా మరోవైపు ఎంతో చర్చ నడుస్తోంది. ఈ చర్చ నేపథ్యంలో ‘తీర్పు’ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ‘మానత్వాన్ని మంటగలిపాడు...’ అంటూ ఇరాకీ స్పెషల్ ట్రిబ్యునల్ సద్దాం హుసేన్కు 2006 నవంబర్ 5న మరణశిక్ష విధించింది. చీఫ్ జడ్జి రషీద్ అబ్దుల్ రెహమాన్ తన తీర్పును గట్టిగా చదివి వినిపించాడు. తీర్పునకు స్పందనగా... ‘‘లాంగ్ లివ్ ది పీపుల్. లాంగ్ లివ్ ది అరబ్ నేషన్’’ అంటూ గర్జించాడు సద్దాం. ‘‘గాడ్ ఈజ్ గ్రేట్’’ అనే వాక్యాన్ని పదే పదే వల్లెవేయసాగాడు.
తీర్పును హర్షిస్తూ సద్దాం వ్యతిరేకులు ఇరాక్ వీధుల్లో పండగ చేసుకున్నారు. సద్దాం వీరాభిమానులు మాత్రం ‘వెన్నుముక లేని తీర్పు’, ‘సామ్రాజ్యవాద ప్రేరేపిత తీర్పు’ అని మండిపడ్డారు. భిన్నస్పందనల విషయం ఎలా ఉన్నప్పటికీ, ఇరాకీ స్పెషల్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చారిత్రక తీర్పుగా చరిత్రపుటల్లో నిలిచిపోయింది. తీర్పు వెలువడిన ముప్పై నాలుగు రోజులకు 2006 డిసెంబర్ 30న సద్దాంకు మరణశిక్ష విధించారు.