ముప్పై ఏళ్ల విషాదం
1983 జూలై 23న ఓ లారీ.. ఉప్పొంగిన వరద కారణంగా కరీంనగర్ జిల్లా ఇరుకుల్ల వాగులో గల్లంతయ్యింది. లారీలో ఉన్న 12 మందిలో నలుగురు కష్టంగా ఒడ్డుకు చేరారు. మరో నలుగురి మృతదేహాలు అప్పట్లోనే లభించాయి. మిగిలిన నలుగురు ఏమయ్యారో, ఎక్కడున్నారో ఆచూకీ దొరకలేదు. సుమారు ముప్పై ఏళ్ల కిందటి మాట ఇది!
వారం రోజుల కిందట..
ఇసుక తవ్వకాల్లో భాగంగా ఇరుకుల్ల వాగులో ఓ లారీ క్యాబిన్, ఆ క్యాబిన్లో అస్థిపంజరాలు, కపాలాలు బయటపడ్డాయి! ఏళ్ల తరబడి తమ వాళ్ల కోసం ఎదురు చూస్తున్న మృతుల కుటుంబాలు వెంటనే ఇరుకుల్ల వాగుకు చేరుకున్నాయి. అక్కడి అస్థి పంజరాలు, కపాలాలు, లారీ క్యాబిన్లో బయటపడిన ప్లాస్టిక్ బ్యాగులు, పాలిస్టర్ దుస్తుల ఆనవాళ్లను చూసి తమ వాళ్లుగా గుర్తించాయి. ఇరవై తొమ్మిదేళ్ల కిందట ఆచూకీ లేకుండా పోయిన తమ వాళ్ల కోసం తిరిగి తిరిగి అలసిపోయిన ఆ కుటుంబాలు.. తమ వాళ్లు లేరని తెలిసే లోగా ఆర్థికంగా చితికిపోయాయి. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. ఆ ఒక్క ప్రమాదం ఆ కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఇదో అత్యంత విషాద ఘటన.
ఇరుకుల్ల వాగులో చేదు జ్ఞాపకం
ఆ ఘటన జరిగిన రోజు.. భారీ వర్షం వరదలతో ఇరుకుల్ల వాగు పొంగిపొర్లింది. ఇరుకుల్ల బ్రిడ్జిపై వరద పోవడంతో పెద్దపల్లి నుంచి కేశవపట్నానికి పశువుల లోడుతో వెళ్తున్న లారీ కొట్టుకుపోయింది. ఆ లారీలో మొత్తం పది మంది ఉండగా డ్రై వర్ అబ్దుల్ ఘనితో పాటు మరొకరు మృతి చెందినట్లు అప్పట్లోనే ప్రకటించారు. ఆ ఘటన నుంచి మల్లేశం, ఎల్లయ్య, సుదర్శనం, మొగిలి.. ప్రాణాలతో బయటపడగా మరో నలుగురి ఆచూకీ దొరకలేదు.
గల్లంతయిన వారిలో శంకరపట్నంకు చెందిన లారీ యజమాని ఎండి దౌలత్ ఖాన్, అతని సోదరుడు, పశువుల వ్యాపారి ముగ్ధుంఖాన్, పశువుల కాపరి కటికె శంకర్, మరొకరు కల్లెపెల్లి వెంకటస్వామిలు ఉన్నారు. ఆ ప్రమాద ఘటన క్రైమ్ నంబర్ 160/89 గా నమోదు అయ్యింది. ప్రమాదం జరిగిన మరుసటి రోజు క్రేన్ సహాయంతో లారీని బయటికి తీసే ప్రయత్నం చేసినా, కొంతభాగం మాత్రమే బయటకు వచ్చింది. గల్లంతయిన వారి ఆచూకీ మాత్రం దొరకలేదు. ఆ నలుగురి కోసం, లారీ కోసం కుటుంబ సభ్యులు రోజుల తరబడి వెతికినా ఫలితం కనిపించలేదు. దాంతో ఆ అవశేషాలు కాలగర్భంలో కలిసిపోయాయి.
వస్తారని ఎదురుచూపులు
సంతకు వెళ్లొస్తామని ఇంటి బయటకు వెళ్లారు. పని ముగించుకుని ఇంటికి చేరాల్సిన వారు తిరిగి ఇంటికి చేరుకోలేదు. తమ వాళ్లు ప్రయాణించిన లారీ ముంచెత్తిన వరదల్లో కొట్టుకు పోయిందన్న వార్త కుటుంబసభ్యుల గుండెలు బరువెక్కేలా చేసినా, బతికే ఉంటారన్న ఆశను కూడ ఎక్కడో మినుకుమినుకుమంటూ ఉంది.
ఆ ఆశతోనే వారు ఏళ్ల తరబడి నిరీక్షించారు. ఏడాది... రెండేళ్లు.. ఐదేళ్లు.. పదేళ్లు.. పాతికేళ్లు.. ఇలా ఎన్నేళ్లు చూసినా కాలం మాత్రం జవాబు చెప్పలేదు. చివరకు మూడు దశాబ్దాలు ముగిసిపోయే సమయంలో ఆ నాలుగు కుటుంబాలకు అసలు నిజం తెలిసింది తమ వాళ్లు లేరని! కాల క్రమంలో ఇంటి పెద్దలు అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. జీవితాలు చెల్లాచెదురయ్యాయి. ఇప్పుడీ నిజం తెలిశాక బరువెక్కిన గుండెలతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
రోడ్డున పడిన ఖాన్ల కుటుంబాలు
కరీంనగర్ జిల్లా శంకరపట్నంకు చెందిన జహీరాబేగం కుమారులు ముగ్ధుంఖాన్, దౌలత్ ఖాన్లు. దౌలత్ ఖాన్ గల్లంతయిన లారీ ఓనర్. అతని అన్న ముగ్ధుంఖాన్ పశువుల వ్యాపారి. ఇద్దరూ పెద్దపల్లి పశువుల సంతలో పశువులు కొనుగోలు చేసి లారీలో సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరగా మార్గమధ్యలో జరిగిన ఈ ప్రమాదంలోనే గల్లంతయ్యారు.
ముగ్ధుంఖాన్ కు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఘటన తర్వాత కుటుంబ పెద్ద ఆచూకీ లేక అనేక అవస్థలు పడుతున్న వీరికి.. కొడుకు మరణం తీరని శోకాన్ని మిగిల్చింది. బతికున్నప్పుడు పది మందికి ఉపాధి, పట్టెడన్నం పెట్టిన దౌలత్‌ఖాన్ కుటుంబం ఇప్పడు దీనావస్థలో.. నిర్మాణంలో ఉన్న ఇల్లు మధ్యలోనే ఆగిపోయి శిధిలావస్థకు చేరుకుంది.
ఉండడానికి ఇల్లు సైతం లేక పక్కింట్లో అద్దెకు ఉంటూ కూలీపనితో పూట గడుపుకుంటున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఇద్దరు కూతుళ్లకు తల్లి కూలి పని చేసి పెళ్లిళ్లు చేస్తే.. వారిలో ఓ బిడ్డ భర్త సైతం మృతి చెందారు. విధి తమ పాలిట శాపంగా మారందని ఆ కుటుంబం ఇప్పుడు పుట్టెడు దుఃఖంతో రోజులు గడుపుతోంది.
శంకర్ గల్లంతు.. కుటుంబం ఛిన్నాభిన్నం
వరదల్లో కొట్టుకుపోయిన లారీలో గల్లంతైన కరీంనగర్ కు చెందిన మరోవ్యక్తి లింగపల్లి శంకర్. శంకర్ కు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు కాగా, శంకర్ ఆచూకీలేక అతని భార్య మనోవేదనతో ప్రాణాలు కోల్పోయింది. తండ్రి అడ్రస్ లేక, తల్లికానరాని లోకాలకు వెళ్లడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. వారిని బంధువులు చేరదీయడంతో తలోచోట పెరిగి పెద్దవారయ్యారు. పెళ్లిళ్లూ అయ్యాయి. తవ్వకాల్లో లారీ ఆనవాళ్లు బయటపడ్డాయని తెలియడంతో కూతుళ్లు, కొడుకు ఇరుకుల్లకు చేరుకున్నారు. అస్థికలు కనిపించాయి.
వెంకటస్వామి ఇంట.. విషాదమే అంతా..
కల్లెపల్లి వెంకటస్వామి ఇంట అంతా విషాదమే. వెంకటస్వామికి భార్య ఐదుగురు కూతుళ్లు, ఐదుగురు కొడుకులు. ఇద్దరు కొడుకులు తండ్రి పై బెంగతో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ పెద్ద గల్లంతై ఆచూకీ లేకపోవడంతో ఉన్న ఇల్లు అమ్మి, కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించింది వెంకటస్వామి భార్య రూతమ్మ.
వెంకటస్వామి పశువుల వ్యాపారి కావడంతో అప్పట్లో ఆ కుటుంబం కాస్త స్థోమత ఉన్నదే అయినప్పటికి ఇరుకుల్ల ఘటనతో చిన్నాభిన్నమై పుట్టెడు కష్టాలను అనుభవిస్తోంది. కదిలిస్తే కన్నీటి పర్యంతమవుతూ ‘‘ఆ రోజు సంతకు పోయిండు.. అంతే ఇంక తిరిగిరాలేదు’’ అని ఆవేదన చెందుతోంది.
మేమూ బతుకుతమని అనుకోలేదు
ఇరుకుల్లలో లారీ కొట్టుకుపోయిన దాంట్లో మేమూ కూడా బతుకుతమనుకోలేదు. పెద్దపల్లి అంగడిలో లారీ లోడ్ చేసుకుని వచ్చేసరికి దాదాపు సాయంత్రం 6 గంటలైంది. వర్షం బాగా వస్తోంది. వంతెనపై నుంచి వరదపోతుంది. మా ముందు కారు, చేతక్ ఉన్నాయి. లారీ క్యాబిన్లో మొత్తం పది మందిమి ఉన్నాం. మధ్యలోకి పోయేసరికి వరద ఎక్కువై లారీ కొట్టుకు పోయింది. నాతోపాటు ఎల్లయ్య, సుదర్శనం, మొగిలి వాగులో ఈదుకుంటూ కష్టంగా బయటపడ్డం.
– మల్లేశం, ప్రత్యక్షసాక్షి, కేశవపట్నం, కరీంనగర్ జిల్లా
ఇరవైతొమ్మిదేండ్ల నుంచి చూస్తనే ఉన్నం
మా ఆయన ఎప్పుడొస్తడా అని ఇరవై తొమ్మిదేండ్ల నుంచి చూస్తున్నం. బాబాలు చెప్తరంటే ఐదారు వేల రూపాయలు ఖర్చు పెట్టి అట్ల చెప్పించుకున్నం. అంతా వెతికినం. కానీ మా ఆయన జాడ తెలువలే... కోర్టులెంబడి పొమ్మంటే అట్ల పోయినం. అధికారుల దగ్గరికి తిరిగినం. ఏం పత్తా దొరకలే. చివరకు మొన్న వాగులో తవ్వకాల్లో ఎల్లినయంటే పోయినం.. పుర్రెలు దొరికినయ్. – గౌసియా బేగం, ముగ్ధుం ఖాన్ భార్య
అమ్మా అంగడికి పోయత్తమని పోయిండ్రు.. ఇగ రాలేదు
అమ్మా అంగడిపోయత్తమని పోయిండ్రు... పొద్దుగూకే దాక చూసినా రాకపోతే ఏడ్చుడూ మొదలు పెట్టినా నా కొడుకులేరని. అప్పటికే ఓ కొడుక్కు ముగ్గురు పిల్లలు, ఇంకో కొడుక్కు ఒక్కలు. మరుసటి రోజు ఒకరొచ్చి వాగుల కొట్టుకుపోయిండ్రని చెప్పిన్రు. ఆ రోజు నుంచి ఇప్పటికీ కూడా నా కొడుకులు వత్తరని తెల్లందాకా, పొద్దుందాక ఎదురుచూస్తున్న. ఇప్పుడు బొక్కలు తేలినయ్ అని చెప్పిన్రు. మా బతుకులు ఆగమైపోయినయ్.
– జహీరాబేగం, దౌలత్, ముగ్ధుంఖాన్ల తల్లి
ఆధారం పోయింది.. ఆగమై పోయినం
మా ఆయన అంగడికని పోయిండు.. అటే పోయిండు. వాగులో లారీ బోర్లపడి చనిపోయిండని చెప్పిండ్రు గానీ శవమైతే అప్పుడు దొరకలే. ఐదుగురు ఆడపిల్లలు, ఐదుగురు మగ పిల్లలు సంతానం. వారంతా చిన్నపిల్లలు కావడం వల్ల పెద్దదిక్కు లేక ఎటూ తిరగలే.. ఇద్దరు పిల్లలు తండ్రి మనాది పెట్టుకుని చచ్చిపోయిండ్రు. మిగిలిన పొల్లగండ్లను కొంగుపట్టి అడుక్కుంటూ, కూలీ కైకిలి చేసి సాదుకున్న. ఇప్పుడు కూడా కూలీ కైకిలి చేసుకునే బతుకుతున్నం.
– కల్లెపెల్లి రూతమ్మ, వెంకటస్వామి భార్య
మా నాన్న చనిపోయినప్పుడు చిన్న పిల్లలం
మా నాన్న కటికె శంకర్ ఇరుకుల్ల వాగులో లారీ బోల్తాపడి చనిపోయినపుడు నేను చిన్నదాన్ని. నాతోపాటు చెల్లి, తమ్ముడున్నారు. అపుడు శవం కూడా దొరుకలేదు. నాన్న పోయిన రంధితో ఏడాదికే అమ్మ కూడా చనిపోయింది. దీంతో మా బంధువులు చేరదీయడంతో ఈ స్థాయిలో ఉన్నాము. వాగులో లారీ బయటకు వచ్చిందని తెలిస్తే వచ్చాము. కొన్ని ఎముకలు దొరికితే వాటిలో మా నాన్నవి ఉంటాయని అనుకున్నాము.
– సరిత, కటికె శంకర్ పెద్దకూతురు
– గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, కరీంనగర్