'మా టార్గెట్ మీరే.. అంతం చేస్తాం'
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను అంతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి హెచ్చరించారు. తమ తదుపరి లక్ష్యం ఐఎస్ నాయకులేనని, ఎక్కడున్నా హతమారుస్తామని అన్నారు. కాలిఫోర్నియాలో దాడి అనంతరం ఒబామా రెండోసారి సోమవారం ఉగ్రవాద వ్యతిరేక చర్యల గురించి మాట్లాడారు. అమెరికా మిలటరీ అధికారులతో సమావేశమై చర్చించారు.
ఇరాక్, సిరియాలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను నిర్మూలించడానికి అమెరికా, మిత్రదేశాలు కలసికట్టుగా పోరాడుతాయని చెప్పారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు పోరాటాన్ని ముమ్మరం చేసినట్టు వెల్లడించారు. 'ఐఎస్ నాయకులు ఎక్కడా తలదాచుకోలేరు. మేం ఐఎస్ నాయకులకు పంపే సందేశం ఒక్కటే. మా టార్గెట్ మీరే' అని ఒబామా పేర్కొన్నారు.
కాలిఫోర్నియా దుర్ఘటన అనంతరం ఒబామా ఆ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఐసిస్ ఉగ్రవాద సంస్థను నాశనం చేసి తీరుతామని ఒబామా ప్రకటించారు. అమెరికాలోను, ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనస్సులను కలుషితం చేస్తున్న కొత్త దశ ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొంటామన్నారు.