రూ.14 వేల కోట్లకు లైటింగ్ పరిశ్రమ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో లైటింగ్ (విద్యుత్ దీపాలు) పరిశ్రమ పరిమాణం రూ.14 వేల కోట్లకు చేరుకుంది. వృద్ధి రేటు 15 శాతముందని ఇండియన్ సొసైటీ ఆఫ్ లైటింగ్ ఇంజనీర్స్(ఐఎస్ఎల్ఈ) తెలిపింది. మొత్తం పరిశ్రమలో దిగుమతుల వాటా రూ.5 వేల కోట్లని సొసైటీ రాష్ట్ర శాఖ చైర్మన్ డి.కృష్ణ శాస్త్రి తెలిపారు.
ఐఎస్ఎల్ఈ రాష్ట్ర శాఖ ఆవిష్కరణ సందర్భంగా గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్ఈడీ లైట్ల వ్యాపారం దేశంలో రూ.1,000 కోట్లుందని చెప్పారు. వృద్ధి రేటు అత్యధికంగా 150 శాతం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్ ఎల్ఈడీదేనని వివరించారు. దేశంలో ఎల్ఈడీ లైటింగ్ తయారీని ప్రోత్సహించే విధానమేదీ లేకపోవడం పరిశ్రమకు నిరాశ కలిగిస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న హార్డ్వేర్ పార్కుల్లో లైటింగ్ కంపెనీలకు చోటు ఇవ్వాలని ఆయన కోరారు. నేషనల్ లైటింగ్ కోడ్ అందుబాటులోకి వచ్చినా అమలు కావడం లేదని వ్యాఖ్యానించారు.