పొదుపు పెరిగేలా ఐటీ మినహాయింపులు
* ఆర్బీఐ గవర్నర్ రాజన్ సూచన
* ద్రవ్యోల్బణం ఆందోళనకరమేనని వ్యాఖ్య
ముంబై: ఆదాయపు పన్ను చెల్లించేవారికి సెక్షన్ 80సీ కింద లభించే పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి మరింత పెంచాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. చాలా కాలం పాటు రూ. లక్ష వద్దే ఈ పరిమితి ఉందని, మన పొదుపు రేట్లు భారీగా పెరగకపోవడానికి ఇదీ ఒక కారణమని తెలియజేశారు.
గత బడ్జెట్లో ఈ మొత్తాన్ని రూ.1.5 లక్షలు చేసినప్పటికీ ఆర్థిక పథకాల ద్వారా వ్యక్తులు మరింత ప్రయోజనం పొందడానికి ఈ మొత్తాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతర సమావేశంలో రాజన్ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28న బడ్జెట్ రానుండటంతో రాజన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, న్యూ పెన్షన్ స్కీమ్, బీమా పాలసీలు, ఈక్విటీ అనుసంధాన పొదుపు పధకాలన్నీ 80సీ పరిధిలోకి వస్తాయి. వీటిలో రూ.1.50 లక్షల వరకూ పెట్టే పెట్టుబడులపై ఇపుడు ఐటీ మినహాయింపు ఉంది. 2008 ఆర్థిక సంవత్సరంలో 36.9 శాతంగా ఉన్న దేశ పొదుపు రేటు ప్రస్తుతం 30 శాతానికి పడిపోయిన విషయాన్ని రాజన్ ప్రస్తావించారు.
మూలధన పెట్టుబడులు పెరగాలి...
ఎటువంటి దుర్వినియోగం కాకుండా సబ్సిడీలను హేతుబద్దీకరించడంతోపాటు మూలధన పెట్టుబడులను పెంచడం ద్వారా ద్రవ్య స్థిరీకరణ జరగాలని ఆర్బీఐ కోరుకుంటున్నట్లు రాజన్ చెప్పారు. దీనివల్ల దేశానికి భారీ ఆర్థిక ప్రయోజనాలు ఒనగూరుతాయన్నారు. మూలధన పెట్టుబడుల పెంపు వల్ల సరఫరాల వైపు సమస్యలూ తగ్గుతాయని, ఇది ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడుతుందని విశ్లేషించారు. ద్రవ్యోల్బణంపై ఇంకా ఆందోళనలున్నాయని రాజన్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం అత్యంత దిగువశ్రేణిలో ఉన్నప్పటికీ తిరిగి ఇవి పెరిగే అవకాశాలు లేకపోలేదని అన్నారు.
9వ తేదీ జీడీపీ గణాంకాలపై దృష్టి!
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలకు సంబంధించి... ఆ గణాంకాలను లెక్కించే పద్ధతుల ప్రాతిపదికన ఆర్బీఐ విధానం మారిపోదని రాజన్ వ్యాఖ్యానించారు. ఇటీవల బేస్ రేటు మార్పుతో (2004-05 నుంచి 2011-12గా) వెలువడిన జీడీపీ సవరింపు గణాంకాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికాభివృద్ధికి సంబంధించి గాయాల బాధ తీవ్రత నుంచి మనం బైటపడ్డాం తప్ప, గాయాల నుంచి మాత్రం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్పీఏల సంక్షోభం రాదు..
మొండి బకాయిల వల్ల భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఎటువంటి సంక్షోభ పరిస్థితులూ తలెత్తవని రాజన్ చెప్పారు. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయంటూ... పెట్టుబడుల విషయంలో ఆయా బ్యాంకులకు ప్రభుత్వ మద్దతు ఉన్నందువల్ల వ్యవస్థలో సంక్షోభ పరిస్థితి తలెత్తే అవకాశం ఉండబోదని ఓ ఇంటర్వ్యూలో వివరించారు.