వ్యాపం స్కాంలో సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం దర్యాప్తుకు సుప్రీంకోర్టు అనూహ్య తీర్పునిచ్చింది. 2008 నుంచి 2012 మధ్య ఎంబీబీఎస్‌లో చేరినవారి అడ్మిషన్లు చెల్లుబాటుకావంటూ సంచలన తీర్పునిచ్చింది. దీంతో దాదాపు 600 మంది విద్యార్థులపై ఈ తీర్పు ప్రభావం పడనుంది. అదే సమయంలో విద్యార్థులు వేసిన పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఇక కొత్తగా పునర్విచారణ పిటిషన్లకు దాదాపు అవకాశం లేకుండా పోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో అక్రమ పద్ధతుల్లో వ్యాపమ్ ప్రి-మెడికల్ పరీక్షను రాసి ముడుపులు చెల్లించి పెద్దమొత్తంలో వైద్య సీట్లు పొందారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు వైద్య విద్యార్థులను అరెస్టు చేసి జైలులో వేసి విచారణ చేస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో పలుమార్లు దుమారం రేపింది కూడా.
ఈ కేసును సీబీఐ విచారణ చేయాలని ఆ సమయంలో సుప్రీంకోర్టు స్వయంగా ఆదేశించింది. అదేసమయంలో మధ్యప్రదేశ్ లోని వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న 72 కేసులను తమ అధీనంలోకి తీసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగానే విచారణ చేసిన సీబీఐ ఇతర దర్యాప్తు సంస్థల వివరాలను పరిశీలించిన ధర్మాసనం అక్రమాలకు కారణమైన 2008-2015 ఐదేళ్ల ఎంబీబీఎస్ కోర్సు ఆ కాలానికి చెల్లదంటూ తీర్పునిచ్చింది.