జ్యువెలరీ షాపులో చోరీ
చైతన్యపురి, న్యూస్‌లైన్: షట్టర్‌ను తొలగించి జ్యువెలరీ షాపులో చోరీకి పాల్పడిన ఘటన సరూర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, షాపు నిర్వాహకుడు తెలిపిన వివరాల ప్రకారం... చార్మినార్‌కు చెందిన మనీష్‌కుమార్ శర్మ దిల్సుఖ్నగర్ బావర్చి హోటల్ పక్క సందులోని ఓ బిల్డింగ్‌లో కవిత జ్యువెలరీ పేరిట వన్‌గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాపును నిర్వహిస్తున్నారు. దసరా పండుగ కావటంతో రెండు రోజుల పాటు షాపును మూసి ఉంచారు. మనీష్‌కుమార్ మంగళవారం ఉదయం దుకాణానికి వచ్చి.. కింది అంతస్తులోని షట్టర్‌ను తెరిచా రు. తర్వాత మొదటి అంతస్తులోనికి వెళ్లి చూడగా దుకాణం షట్టర్ తెరిచి ఉంది. గ్లాస్ డోర్ పగిలి ఉండటంతో పాటు లోపల ఆభరణాల ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలు పడి ఉన్నాయి.
రెండు షోకేసుల్లోని వన్‌గ్రామ్ గోల్డ్ ఆభరణాలు, ముత్యాల దండలు, జైపూర్ జ్యువెలరీలు కనిపించలేదు. చోరీ జరిగిందని గ్రహించిన ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సుధాకర్, ఎస్ఐ ఖలీల్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. షట్టర్ ముందు రక్తపు మరకలు ఉన్నాయి. దొంగ అద్దాలను పగులగొట్టినప్పడు అతని చేతికి గాయమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో షట్టర్‌ను లేపేందుకు వినియోగించే ఇనుపరాడ్ లభ్యమైంది. ఇద్దరు లేక ముగ్గురు ఈ చోరీలో పాల్గొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చోరీకి గురైన ఆభరణాల విలువ ఇంకా నిర్ధారణ కాలేదు. షాప్‌లో పెద్ద మొత్తంలో ఆభరణాల నిల్వ ఉన్నప్పటికీ రెండు షోకేసుల్లో ఉన్న ఆభరణాలను మాత్రమే దొంగలు ఎత్తుకెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.