గార్దభం..పోటీ అదరహో!
నంద్యాల: జంబులాపరమేశ్వరి తిరునాల సందర్భంగా శనివారం గార్దభాల(గాడిదల) పోటీలు నంద్యాల పట్టణంలో ఆసక్తికరంగా సాగాయి. పోటీలకు మహానంది, వెలుగోడు, బండి ఆత్మకూరు, రుద్రవరం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, కోవెలకుంట్ల ప్రాంతాల నుండి 20 గాడిదలు వచ్చాయి. లక్కీడిప్ ద్వారా పందెంలో పోటీ పడే గాడిదలను ఎంపిక చేశారు. దాదాపు 160 కేజీల ఇసుకను బస్తాలను కట్టి గాడిదలపై ఉంచి పరుగు పెట్టించారు. ఎక్కువ దూరం పరిగెత్తిన వాటిని విజేతలుగా ప్రకటించారు. విజేతలైన గాడిదల యజమానులకు వరుసగా రూ.5వేలు, రూ.4వేలు, రూ.3వేలు, రూ.2వేలు, రూ.వెయ్యి నగదు బహుమతులుగా అందజేశారు. పోటీల్లో హింసకు తావులేకుండా ముళ్లకర్రను నిషేధించారు.
గాడిద లక్ష రూపాయలు..
పోటీల్లో బెంగళూరు నుంచి బండి ఆత్మకూరుకు చేరిన రేసు గాడిద ఆకర్షణగా నిలిచింది. దీని ఖరీదు అక్షరాల లక్షరూపాయలు. బెంగళూరులో పలు పోటీల్లో ఇది విజేతగా నిలువడంతో డిమాండ్ వచ్చింది. బండిఆత్మకూరు మండలానికి చెందిన లింగమయ్య దీనిని కొనుగోలు చేశారు. ప్రతిరోజూ మంచి పౌష్టికాహారాన్ని అందించి దీనిని రేసు గాడిదగా తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు.
గాడిదల ఉనికిని చాటేందుకే..
రవాణా వసతులు పెరగడంతో గాడిద జాతి అంతరించిపోతోందని, వీటి ఉనికిని చాటడానికి నాలుగైదేళ్లుగా పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లెల్ల శ్రీరాములు తెలిపారు. పోటీల్లో ఆలయ పాలక మండలి కార్యదర్శి గాండ్ల వెంకటేశ్వర్లు, నిర్వాహకులు పరమేశ్వరరెడ్డి, జిల్లెల్ల శ్రీరాములు, ఎన్కే నూర్బాషా, పాణ్యం మద్దిలేటిస్వామి, జూటూరు పెద్ద వెంకటేశ్వర్లు, గాండ్ల మధుప్రకాష్ పాల్గొన్నారు.