పొదుపు మహిళలందరికీ రూపే కార్డులు
కర్నూలు(హాస్పిటల్): నగదు కొరత నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ రూపే కార్డులు యాక్టివేట్ చేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు వెలుగు సీఈఓ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. జిల్లాలో ఎంత మంది పొదుపు మహిళలకు జనధన్ఖాతాలున్నాయి, ఎంత మందికి ఎస్బీ అకౌంట్లున్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. జనధన్ ఉన్న వారికి రూపే కార్డులున్నాయా..?, ఉంటే ఎన్ని యాక్టివ్‌లో ఉన్నాయి, యాక్టివ్‌లో లేని వాటికి ఎలా అమలులోకి తీసుకురావాలనే విషయాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జనధన్ ఖాతా లేని వారికి సాధారణ ఏటీఎంలు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 4లక్షలకు పైగా పొదుపు మహిళలు ఉన్నారు. వీరందరికీ ఒకటో తేది నాటికి రూపే, ఏటీఎం కార్డులు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.