సీరియల్ రేపిస్టుకు జీవిత ఖైదు
ఇంటర్నెట్ డేటింగ్ సైట్లో తాను కలిసిన ఐదుగురు మహిళలపై అత్యాచారం చేసి, మరో ఇద్దరిపై దాడికి పాల్పడిన సీరియల్ రేపిస్టుకు జీవిత ఖైదు పడింది. హాంప్షైర్లోని లిప్హూక్ ప్రాంతానికి చెందిన జాసన్ లారెన్స్ (55) రెండు వేర్వేరు రకాల ప్రొఫైల్స్ సృష్టించుకుని, ఐదు ప్రాంతాలకు చెందిన మహిళలను ఆకర్షించి, వారిపై అత్యాచారం చేశాడు. ఆ నేరం రుజువు కావడంతో అతడికి జీవితఖైదు విధించారు. పెరోల్ రావాలన్నా కనీసం 12 సంవత్సరాల ఆరు నెలల పాటు అతడు జైల్లో ఉండాల్సి వస్తుంది.
అతడు మహిళల పాలిట రాక్షసుడని, అత్యంత ప్రమాదకారి అని జడ్జి గ్రెగరీ డికిన్సన్ అన్నారు. మ్యాచ్.కామ్ అనే డేటింగ్ సైట్లోనే తన భార్యను కూడా కలిసిన లారెన్స్, ఆమెను పెళ్లాడిన కొన్ని నెలలకే ఈ దాడులు చేశాడు. 2011 జూన్ నుంచి 2014 నవంబర్ వరకు డెర్బీషైర్, లింకన్షైర్, నార్తాంప్టన్షైర్, కేంబ్రిడ్జిషైర్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి.