జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్‌కు జశ్వంత్ తేజ
ఢిల్లీ వెళతాననుకోలేదు: పేద కుటుంబంలో పుట్టిన నేను నాజీవితంలో కనీసం ఢిల్లీ చూడడానికైనా వెళ్తానని అనుకోలేదు. ఎన్సీసీపై నాకున్న ఆసక్తే ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్లో పాల్గొనే అవకాశాన్నిచ్చింది.
- జశ్వంత్‌తేజ
కాజులూరు, న్యూస్‌లైన్ : గొల్లపాలెం జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న వినకోటి జశ్వంత్ తేజ ఎన్సీసీలో తన ప్రతిభ చాటుతూ దూసుకుపోతున్నాడు. ఇటీవల జరిగిన పలు జిల్లా, రాష్ట్ర స్థాయి క్యాంపుల్లో అవార్డులు సాధించడమే కాకుండా ఈ నెల 27 నుంచి అక్టోబర్ ఎనిమిదో తేదీ వరకూ ఢిల్లీలో జరుగనున్న జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్‌కు ఎంపికయ్యాడు. జశ్వంత్ తేజ తల్లి రామకృష్ణవేణి గొల్లపాలెం పీహెచ్సీలో ఏఎంఎన్గా, తండ్రి సత్యనారాయణ మంజేరులో వీఆర్ఏగా పనిచేస్తున్నారు. జశ్వంత్ తేజ ఎనిమిదో తరగతిలో ఎన్సీసీలో చేరాడు.
గత వారం నిజామాబాద్‌లో రాష్ట్ర స్థాయిలో జరిగిన రైఫిల్ షూటింగ్లో మెదటి స్థానం సాధించి జశ్వంత్ తేజ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు ఎన్సీసీ ఆఫీసర్ వి. మాచరరావు తెలిపారు. ఈ పోటీలకు మన రాష్ట్రం నుంచి ఆరుగురు ఎంపికయ్యారని, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల స్థాయిలోని 18వ ఆంధ్రా బెటాలియన్ నుంచి జశ్వంత్‌తేజ ఒక్కడే ఎంపిక కావటం గర్వించదగ్గ విషయమని స్కూల్ హెచ్ఎం వీఎస్ సుజాత అన్నారు. గ్రామ సర్పంచ్ వడ్డి సత్యవతివెంకటరమణ, అలైన్స్క్లబ్ అధ్యక్షుడు శేఠ్ రాజ్‌పటేల్, జోన్ చైర్మన్ టి. వాసురెడ్డి తదితరులు జశ్వంత్‌కు అభినందనలు తెలియజేశారు.