గోడౌన్లలో సర్దుకోండి
హైదరాబాద్: విజయవాడ, పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న గోడౌన్లను కార్యాలయాలుగా మార్చుకోవాలని జవహర్‌రెడ్డి నేతృత్వంలోని రాజధాని తరలింపు కమిటీ సూచించింది. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులతో కమిటీ గురువారం వేర్వేరుగా చర్చించింది. కమిటీ సూచించిన గోడౌన్లు, ఇతర భవనాలను ముందుగా వెళ్లి చూసుకోవాలని అన్ని శాఖలకు చెప్పింది. రాజధానికి ప్రభుత్వ శాఖలన్నీ తరలింపు తథ్యమని, ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టంగా ఉందని కమిటీ తేల్చి చెప్పింది.
జూన్ 1 నాటికి విజయవాడకు తరలి వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని సూచించింది. గోడౌన్లు, ఇతర భవనాల్లో కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన ఇంటీరియర్ పనులు వీలయినంత త్వరగా మొదలుపెట్టాలని, కార్యాలయ నిర్వహణకు అససరమైన సామగ్రిని సమకూర్చుకోవాలని చెప్పింది. వ్యవసాయం, దాని అనుబంధ శాఖల కార్యాలయాలను విజయవాడ శివారు ప్రాంతంలోని గొల్లపూడిలో ఉన్న గోడౌన్లలో ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. మిగతా కార్యాలయాలకూ ఇదే తరహా వసతిని కమిటీ ప్రతిపాదించింది.
మూతబడిన కాలేజీలలో కమిషనరేట్లు...
వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్, ఎక్సైజ్ కమిషనరేట్ల కార్యాలయాలకు వసతి భవనాలను ఆయా శాఖలే చూసుకోవాలని కమిటీ సూచించింది. గొల్లపల్లిలోని మూత పడిన కాలేజీలను గుర్తించి అక్కడకు ఈ కమిషనరేట్లను తరలించనున్నారు. అన్ని శాఖలకు కమిటీయే కార్యాలయ వసతిని చూడలేదని, ఈ నేపథ్యంలో ఆయా శాఖాధిపతులే కార్యాలయాల వసతులను చూసుకోవాలని కమిటీ సూచించింది. మిగతా శాఖల అధికారులతో వచ్చే వారం సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. అనంతరం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ కమిటీ చర్చించనుంది. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న స్థానికత, 30 శాతం హెచ్ఆర్ఏ.. తదితర అంశాలపై సీఎస్‌తో చర్చించిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పక్షం రోజుల్లోగా శాఖలు, ఉద్యోగుల తరలింపుపై ప్రభుత్వానికి నివేదికను సమర్పించాలని జవహర్‌రెడ్డి కమిటీ నిర్ణయించింది.