అమెరికాలో విద్యార్థి కాల్పులు
వాషింగ్టన్: అమెరికాలోని సీటెల్ నగరంలోని మేరీస్విల్లే హైస్కూల్లో ఓ విద్యార్థి తన తోటి విద్యార్థులే లక్ష్యంగా శుక్రవారం కాల్పులకు తెగబడ్డాడు. జేలెన్ ఫ్రైబెర్గ్ అనే విద్యార్థి.. హైస్కూల్లోని కేఫ్టేరియాలోకి ప్రవేశించి ఓ విద్యార్థినిపై తుపాకీతో కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం ఆ విద్యార్థి తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు.
ఈ కాల్పుల ఘటన వాషింగ్టన్ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన స్థానిక పరిశోధనాధికారులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనలో గాయపడిన జారోన్ వెబ్(15) అనే విద్యార్థి కథనం మేరకు కాల్పులకు పాల్పడిన విద్యార్థి.. ఓ అమ్మాయి వ్యవహారంలో ఘర్షణ పడ్డాడని.. ఈ నేపథ్యంలోనే కాల్పులకు పాల్పడి ఉంటాడని పేర్కొన్నాడు.