రేమండ్ చేతికి కామసూత్ర బ్రాండ్
♦ భాగస్వామ్య సంస్థ నుంచి 50% వాటాల కొనుగోలు
♦ రూ. 19.30 కోట్ల డీల్
న్యూఢిల్లీ: టెక్స్టైల్ దిగ్గజం రేమండ్ తాజాగా కామసూత్ర బ్రాండ్‌ను పూర్తి స్థాయిలో దక్కించుకుంది. ఈ బ్రాండ్ కింద కండోమ్‌లు, డియోడరెంట్లు విక్రయించే జాయింట్ వెంచర్ జేకే అన్సెల్లో భాగస్వామ్య సంస్థ అన్సెల్కి ఉన్న 50% వాటాలను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 19.30 కోట్లు. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు తయారు చేసే జేకే అన్సెల్ ఇకపై జేకే ఇన్వెస్టో ట్రేడ్ (జేకేఐటీ)కి అనుబంధ సంస్థగా మారుతుందని రేమండ్ గ్రూప్ పేర్కొంది.
డీల్‌లో భాగంగా జేకే అన్సెల్.. తమ సర్జికల్ గ్లవ్స్ వ్యాపారాన్ని అన్సెల్ గ్రూప్‌లో భాగమైన పసిఫిక్ డన్లప్ హోల్డింగ్స్‌కి విక్రయిస్తుంది. ఈ ఒప్పంద విలువ రూ. 11.30 కోట్లు. కామసూత్ర బ్రాండ్ యాజమాన్య హక్కులు పూర్తిగా సొంతం చేసుకోవడం ద్వారా తమ ఎఫ్ఎంసీజీ విభాగం మరింత పటిష్టం కాగలదని రేమండ్ సీఎండీ గౌతమ్ సింఘానియా చెప్పారు. అనుబంధ సంస్థ జేకే హెలెన్ కర్టిస్ ద్వారా రేమండ్ గ్రూప్ 1964లో ఎఫ్ఎంసీజీ లో ప్రవేశించింది. పార్క్ అవెన్యూ బ్రాండ్ కింద పలు ఉత్పత్లు విక్రయిస్తోంది.