ఎన్నాళ్లకెన్నాళ్లకు...
16 ఏళ్ల తర్వాత పేస్ ఖాతాలోఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్
బుసాన్: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన బుసాన్ ఓపెన్‌లో తన భాగస్వామి సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా)తో కలిసి పేస్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో టాప్ సీడ్ పేస్-గ్రోత్ ద్వయం 4-6, 6-1, 10-7తో ‘సూపర్ టైబ్రేక్’లో సంచాయ్-సొంచాట్ రటివటినా (థాయ్‌లాండ్) జోడీపై విజయం సాధించింది.
2000లో జాన్ సిమిరింక్ (నెదర్లాండ్స్)తో కలిసి చివరిసారి పేస్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ (బెర్ముడా ఓపెన్) సాధించాడు. ఏటీపీ సర్క్యూట్లో చాలెంజర్ టోర్నీలనేవి ద్వితీయ శ్రేణికి చెందినవి. ఒకప్పుడు డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన పేస్ ప్రస్తుతం 57వ ర్యాంక్‌లో ఉన్నాడు. దాంతో తన ర్యాంక్ మెరుగుపర్చుకునేందుకు పేస్ చాలెంజర్ టోర్నీల్లో ఆడుతున్నాడు. 42 ఏళ్ల పేస్‌కు ఇది 12వ చాలెంజర్ టైటిల్ కాగా... ఓవరాల్‌గా 66వ టైటిల్ కావడం విశేషం.