రెవెన్యూ గ్రామ బాట
ప్రత్తిపాడు : దీర్ఘకాలంగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ యంత్రాంగం గ్రామబాట పట్టనుంది. జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ రూపుదిద్దిన ఈ కార్యక్రమం కొత్త ఏడాది జనవరి మొదటి వారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. వారంలో మూడు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ అధికారులు గ్రామాల్లోనే ఉండి సమస్యల భరతం పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఎవరెవరు వెళతారు...
మండల స్థాయిలో తహశీల్దార్ నేతృత్వంలో సివిల్‌సప్లయిస్ డిప్యూటీ తహశీల్దార్, ఆర్ఐ, సర్వేయర్, వీఆర్వో, మీ-సేవ కేంద్రం ఆపరేటర్ కలసి ఒక బృందంగా ఏర్పడి ఒక్కో గ్రామానికి వెళతారు. మంగళ, గురు, శనివారం మూడు రోజుల పాటు గ్రామంలోనే ఉంటారు.
ఏడాది మొత్తానికి ప్రణాళిక..
రెవెన్యూ బృందాల పర్యటనకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను ఏడాది మొత్తానికి ఒకేసారి రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకు ఏ ఏ గ్రామాల్లో ఎప్పుడెప్పుడు పర్యటించాలనే దానిపై ప్రణాళిక
రూపొందించి ఉన్నతాధికారులకు అందజేయనున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ..
గ్రామానికి చేరుకున్న రెవెన్యూ బృందం పనితీరు ఇలా ఉంటుంది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు వీఆర్వో కార్యాలయాన్ని సందర్శించడం. వీఆర్వోల పనితీరు ఎలా ఉంది. అందుబాటులో ఉంటున్నారా. రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభించక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఎలా ఉంది. ప్రభుత్వ భూములు, శ్మశాన వాటికలు ఏమైనా ఆక్రమణలకు గురవుతున్నాయా. ప్రజలకు వీఆర్వోలకు మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి. వీఆర్వోలు తొమ్మిది రకాల రికార్డులు సక్రమంగా నిర్వహిస్తున్నారా. రైతులందరి పేర్లు అడంగల్‌లో ఉన్నాయా. ఇలా ప్రతి అంశాన్ని తహశీల్దార్ పరిశీలిస్తారు. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి, ప్రజలు, రైతులు, స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు. వీలైనంత వరకు ఆ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపుతారు.