ఆ నిధులకు ‘నీళ్లొదిలారు’
ఆ కోటిన్నర రూపాయలేంటి అని అడిగితే అధికారులు ‘నీళ్లు’నములుతున్నారు. వందా రెండొందలా..కోటీ పదకొండు లక్షల రూపాయలున్నట్టే మర్చిపోయారు. జిల్లా ప్రజల దాహం తీర్చాల్సిన ఆ నిధులు కాస్తా ఖర్చు పెట్టకుండా విడిచిపెట్టేశారు. రెండేళ్ల తర్వాత మర్చిపోయిన నిధులను అధికారులు గుర్తించి ఇప్పుడు నాలిక్కర్చుకుంటున్నారు.
శ్రీకాకుళం : ఏం జరిగిందంటే.. జిల్లా పరిషత్‌కు తాగునీటి ఎద్దడి నివారణకు 2013లో రూ. 1.11 కోట్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం మంజూరుచేసిన ఈ నిధులను అధికారులు గమనించలేదు. జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు అప్పట్లో ఆర్థిక సంఘ నిధులను ఖర్చు చేశారు. తాజాగా జెడ్పీ అధికారులు ఈ నెల 30న జరగనున్న బడ్జెట్ సమావేశం కోసం ఎజెండాను తయారుచేస్తుండగా లెక్కల్లో తేడా కనిపించింది. ఖాతాలో రూ. 1.11 కోట్లు అదనంగా ఉన్నట్టు తెలుసుకున్నారు. తీవ్ర తర్జన భర్జన అనంతరం 2013లో మంజూరైన నిధులు ఖాతాలోనే మూలుగుతున్నట్టు తెలుసుకున్నారు.
విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త వహించారు. ఈ నిధులు మంజూరైన తరువాత రెండు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అయితే అప్పట్లో ఈ నిధులు వెలుగు చూడకపోవడంతో అధికారులు వేసిన కాకి లెక్కలకు అద్దం పడుతోంది. పాలకవర్గం సభ్యులు కూడా దీనిని గుర్తించకపోవడం పట్ల ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లోనే ఈ నిధులను గుర్తించి ఉంటే జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు ఈ నిధులు వినియోగించడం ద్వారా ప్రజలకు కష్టాలు తప్పేవి. అప్పట్లో తాగునీటి కోసం ఆర్థిక సంఘం నిధుల నుంచి ఖర్చు చేసిన మొత్తం వేరొక అభివృద్ధి పనికి ఉపయోగపడి ఉండేవి. ఇప్పటికైనా అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండాలని పలువురు కోరుతున్నారు. విషయాన్ని జెడ్పీ సీఈఓ నగేష్ వద్ద సాక్షి ప్రస్తావించగా రూ. 1.11 కోట్ల నిధులను గుర్తించడం నిజమేనన్నారు. ఈ ఏడాది ఈ నిధులను వినియోగించి తాగునీటి కష్టాలు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. నిధులు ఖాతాలోనే ఉన్నాయని, గుర్తించలేదే తప్ప అవినీతి ఎక్కడా జరగలేదని చెప్పారు.