వర్ణం: నడుస్తున్న అక్షరాలు
వీళ్లంతా ఒక భీకర పోరాటానికి వెళ్తున్నట్టుగా కనబడట్లేదూ! కొంతవరకూ నిజమే. జె.ఆర్.ఆర్.టోల్కీన్ రచన ‘ద హాబిట్’లోని ఒక యుద్ధ సన్నివేశాన్ని ప్రదర్శించడానికి ఇలా అడవిగుండా వెళ్తున్నారు. 1937లో వచ్చి, పాఠకాదరణ పొందిన ఈ నవలలో మాంత్రికులూ, మరుగుజ్జులతోడుగా మనుషుల్లాంటి జీవులు ఒకవైపూ, దయ్యాలూ, విచిత్ర తోడేళ్లూ మరోవైపూ ఉండి పోరాడుతాయి. అందుకే, ఈ చెక్ రిపబ్లికన్లు తమ పుస్తకాభిమానాన్ని ఇలా చాటుకుంటున్నారు.
జున్ను పందెం
వీళ్లంతా ఇలా ఎగబడి, దొర్లుకుంటూ మరీ పరుగెత్తుతోంది జున్ను దొరికించుకోవడం కోసం! కూపర్స్ కొండ దిగువన ఉంచిన జున్ను కోసం వీళ్లంతా ఈ సాహసం చేస్తున్నారు. దీన్ని ఎందుకు సాహసం అనాలంటే... ఆ కొండ ఎక్కడా కాలు నిలపలేనంత వాలుగా ఉంటుంది! ముందుగా వెళ్లినవాళ్లు సహజంగానే ఆ జున్నును బహుమానంగా పొందుతారు. స్థానిక గ్లౌసెస్టర్ ఆవుల పాలతో చేసే ఈ జున్నును అదే పేరుతో విక్రయిస్తారు. సుమారు రెండువందల ఏళ్లనుంచి ఇలాంటి పోటీ జరుగుతోంది.
‘మురికి’ మనుషులు
వీళ్లంతా ఆనందంగా ఇలా బురదలో దొర్లడానికి ఉన్న ఒకే ఒక్క కారణం, చలికాలం ముగుస్తుండటం! ఒక మైదానంలో జరిగిన ఈ సంబరాల్లో జర్మనీయులు ఇలా మురికిమురికిగా ఆనందించారు. దీన్నే వాళ్లు ‘మురికి పంది’ ఉత్సవం అని కూడా పిలుచుకుంటారు. మనకు మనంగాఈ పోలిక తెస్తే అపరాధం అవుతుందిగానీ, వాళ్లే దీన్ని కోరుకుంటే మనం ఇక చేయగలిగేదేముంది!