సొంతగడ్డపై మెరుస్తారా?
న్యూఢిల్లీ: నేటి (శుక్రవారం) నుంచి జరిగే జూనియర్ ప్రపంచకప్ హాకీలో భారత కుర్రాళ్లు సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో ఈనెల 15 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో 16 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. జర్మనీ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతోంది. ఇక సొంత అభిమానుల మద్దతుతో పాటు ఒత్తిడి కూడా అధికంగానే ఉండడంతో ఈ టోర్నీలో మన్‌ప్రీత్ సింగ్ సేన ఏమేరకు నెగ్గుకురాగలరనేది ఆసక్తికరంగా మారింది.
2001లో భారత జట్టు జూనియర్ ప్రపంచకప్‌ను గెలుచుకోగా ఆ తర్వాత 2005లో కాంస్యం కోసం జరిగిన పోరులో స్పెయిన్‌తో ఓడిపోయి నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటిదాకా జట్టుకిదే ఉత్తమ ప్రదర్శన. ఈ ఏడాది ఆరంభంలో జర్మనీలో జరిగిన మహిళల జూనియర్ ప్రపంచకప్‌లో భారత జట్టు కాంస్యం సాధించింది. కనీసం ఆ స్థాయి ప్రదర్శనైనా కనబరచాలనే ఆలోచనతో ఉన్న కుర్రాళ్లు గ్రూప్ ‘సి’లో నేడు తమ తొలి మ్యాచ్‌లో గత టోర్నీ (2009) రన్నరప్ నెదర్లాండ్స్‌ను ఎదుర్కొనబోతున్నారు. ప్రత్యర్థి పటిష్టమైన జట్టు కావడంతో గెలవకపోయినా కనీసం డ్రా అయినా చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంది.