ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు: కేసీఆర్
హైదరాబాద్ : తమిళనాడు తరహాలో ప్రత్యేక చట్టం తీసుకు వచ్చి ముస్లింలకు జనాభా నిష్పత్రి ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ముస్లింలు అత్యంత పేదరికంలో ఉన్నారని, వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లు తప్పనిసరి అని ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో చట్టం తెస్తామని కేసీఆర్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఎస్టీలు తీవ్రంగా నష్టపోయారని, ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ముస్లింలు, ఎస్టీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎస్టీలు, ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం జరిపిన సుధీర్, చెల్లప్ప కమిషన్లు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ను నివేదిక అందచేశాయి. కాగా తెలంగాణలోని పది జిల్లాలో ఎస్టీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ చెల్లప్ప, సుధీర్ కమిషన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.