నాకు హెచ్ఐవి నేను పాజిటివ్
జ్యోతి జీవితంలో ఎన్నో శాపాలు ఒక శాపం తనకు వరంగా మారింది తన ఏడుపు తనే వినలేదు.. మరో శాపం సమాజానికి వరంగా మారింది.. తన హెచ్ఐవి ఇతరులకు పాజిటివ్ సపోర్ట్‌గా మారింది.. మూడు అబార్షన్లు... ఆరు గాయాలు... డజన్ల వైవాహిక రేప్‌లు... ఒక డైవర్స్ ఇచ్చిపుచ్చుకోవడాల్లో కూడా.. జీవితం అన్యాయం చేసింది హాస్పిటల్ హెచ్ఐవీ ఇచ్చింది... కోర్ట్ కొడుకును తీసుకుంది తను ఒక్కతే మిగిలింది.. కొత్త జీవితం మొదలుపెట్టింది పదిమందికి జ్యోతి వెలుగునిస్తుంది.. పాజిటివ్ వెలుగునిస్తుంది...
సమాజం నుంచి దోసిట్లో దాక్కోవాలా?
ధైర్యంగా అదే సమాజానికి చేయూత నివ్వాలా?
ముంబైలో ఓ మురికివాడ... ఇరుకు సందు... మట్టిగోడలు... నిలబడితే తలకు తగిలే ఎత్తులో రేకుల పైకప్పుతో ఓ పాక. ఆ పాకలో ఓ మహిళను ఇంటర్వ్యూ చేస్తోంది జ్యోతి ధావలే. రేకుల సందుల్లోంచి పడుతున్న వెలుతురును బ్యాలెన్స్ చేసుకుంటూ కెమెరా లైటింగ్‌ని సెట్ చేసుకోవడానికి కుస్తీ పడుతోంది కెమెరా బృందం. అదేమీ పట్టించుకోకుండా ఆ ఇంటి ఆడమనిషి చెప్తున్న కథలో లీనమై పోయింది జ్యోతి.
‘మేడం... ఆమె కెమెరాకి ఫేస్ చేయట్లేదు... ఆమెను కొంచెం తలపెకైత్తమని చెప్పండి’ కెమెరామన్ అన్నాడు. అతని మాటలు పూర్తి కాకముందే చేయి పెకైత్తి ఆపమన్నట్టుగా సైగ చేసింది. అవతలి స్త్రీ చాలా ఉద్వేగంగా చెప్పుకుపోతోంది. దాదాపు అరగంట ఇంటర్వ్యూ తర్వాత ఆమెకు థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చేసింది జ్యోతి. అప్పుడంది కెమెరామన్‌తో.. ‘గోవింద్.. ఆమెను ఇంకెంతోమందికి ఓ స్ఫూర్తిగా చూపడమే ఈ ఇంటర్వ్యూ లక్ష్యం కానీ ఆమె ముఖాన్ని కెమెరా క్లోజప్‌లో చూపించి ఆమెపై ఆమెకే జాలి క్రియేట్ చేయడానికి కాదు’ అంది. ‘సారీ మేడం’ అన్నాడతను. ‘ఇట్స్ ఓకే...’ అంటూ గోవింద్ భుజాన్ని తట్టబోతుంటే ఆ స్పర్శ నుంచి తప్పించుకునే యత్నం చేశాడతను. అర్థమైన ఆమె చిన్నగా నవ్వుకొని ముందుకు నడిచింది.
ఎవరీ జ్యోతి?
‘బ్లాక్ స్వాన్ ఎంటర్టైన్మెంట్’ అనే ప్రొడక్షన్ దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ‘స్త్రీ శక్తి’ అనే కార్యక్రమం కోసం దేశంలోని పలుప్రాంతాల్లోని సామాన్య మహిళల విజయగాథలను చిత్రీకరిస్తోంది. ఆ సంస్థకు క్రియేటివ్ మేనేజర్, సోషల్‌మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ హెడ్. ఇలాంటి సంస్థలు చాలా ఉంటాయి.. ఎన్నో కథలు తెరకెక్కుతాయి. కాని జ్యోతి ఒక్కటే ఉంటుంది. ఆమె సాధారణ స్త్రీ కాదు. ప్రతికూలతలకు ఎదురీదుతూ నిలబడిన అసాధారణ స్త్రీ. ఆమె హెచ్ఐవీ పాజిటివ్. తనలాంటి ఇంకెందరో పాజిటివ్స్ హక్కుల కోసం నిలబడుతోంది.
ఎలా వచ్చింది?
రక్తమార్పిడి ద్వారా జ్యోతికి హెచ్ఐవీ సోకింది. అదో భయంకరమైన గతం. ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుంచి ట్వెల్త్క్లాస్ పూర్తిచేసిన జ్యోతి.. ఆ టైమ్‌లోనే ఓ వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లీ చేసుకుంది. పెళ్లయిన ఐదు నెలలకు భర్త అసలు రూపం బయటపడింది. ‘ఆ క్షణాలు నా కళ్లముందు ఇప్పటికీ కదులుతూనే ఉంటాయి. నేను ప్రెగ్నెంట్‌నని తెలియగానే సంతోషం పట్టలేకపోయాను. ఎప్పుడెప్పుడు ఆయనతో షేర్ చేసుకుంటానా అన్న ఆరాటం. కానీ ఆరాటపడ్డంత సేపైనా ఆ సంతోషం నిలువలేదు.
ప్రెగ్నెంట్‌నని చెప్పగానే ఆయన మొహంలో రంగులు మారాయి. ‘నాకిష్టంలేదు అబార్షన్ చేయించుకో’ అన్నాడు కర్కశంగా. ఎందుకని అడిగేలోపే అక్కణ్ణించి వెళ్లిపోయాడు. మరుసటిరోజు అతనే హాస్పిటల్‌కి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. తర్వాత ఐదు నెలలకు మళ్లీ నెల తప్పాను. ఈసారీ అదే తీరు. ఉండబట్టలేక ఎదిరించాను. ‘ఇష్టంలేకపోతే జాగ్రత్తలు పాటించొచ్చుకదా’ అని అరిచాను. ఈ దేశంలోని స్త్రీకి భరించే బాధ్యత తప్ప ఎదిరించే హక్కులేదని నిరూపించాడు నా భర్త నా మీద చేయిచేసుకొని.
నన్ను కొట్టడమనేది ఆయన దినచర్యలో భాగమైంది.. దాంపత్య జీవితానికి సంబంధించి నేనే జాగ్రత్తపడడం మొదలుపెట్టాను. అయినా ఎక్కడో ఏదో పొరపాటు జరిగి రెండోసారీ పీరియడ్స్ మిస్ అయ్యాయి. ఆనందం వెయ్యకపోగా వెన్నులోంచి వణుకుపుట్టుకొచ్చింది. పోరాడీ లాభంలేదనుకొని ఆయన తీసుకెళ్లిన హాస్పిటల్‌లోని గైనకాలజిస్ట్‌కి నా ఒళ్లు అప్పగించాను. అబార్షన్ జరిగిపోయింది. ఈసారి ఆయనను దగ్గరకు రానివ్వకుండా పోరాడాను. కొట్టి రేప్చేసేవాడు.
డొమెస్టిక్ వయొలెన్స్‌కి వ్యతిరేకంగా ఓ చట్టం ఉందన్న విషయం కూడా తెలీదు నాకప్పుడు. నాలుగోసారీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎప్పట్లాగే అబార్షన్ కోసం హాస్పిటల్ వెళ్లాను. అబార్షన్ కంటే ముందు చేసిన బ్లడ్ టెస్ట్‌లో హెచ్ఐవీ పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. నా కాళ్ల కిందున్న భూమి కంపించినట్టే అయింది. మూడోసారి అబార్షనప్పుడు రక్తం ఎక్కించడంలో హెచ్ఐవీ సోకిందని తేలింది. హెచ్ఐవీ పేషంట్‌కి అబార్షన్ చేయడానికి డాక్టర్ ఒప్పుకోలేదు.
దాంతో ఆ క్షణమే నన్ను వదిలేసి వెళ్లిపోయాడు నా భర్త. తల్లిని అవుతున్నందుకు సంతోషపడాలో, హెచ్ఐవీ సోకినందుకు జీవితం చాలించుకోవాలో తెలీని పరిస్థితి... బిడ్డ ఈ రోగంతో పుడితే.. ఆ ఆలోచనకే తట్టుకోలేకపోయేదాన్ని. తొమ్మిదోనెల అప్పుడు అనుకుంటా.. ఓరోజు వచ్చి చెప్పాడు మా ఆయన.. ‘నాకు ఇంకో అమ్మాయితో సంబంధం ఉంది. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. విడాకులు కావాలి’ అంటూ! నాకు అదేమంత షాకింగ్‌గా అనిపించలేదు.
ఎప్పటిలా మౌనంగానే ఉన్నా. తొమ్మిది నెలలు పూర్తికాకుండానే కొడుకు పుట్టాడు. ఒక్క విషయంలో అదృష్టం నాకు తోడైంది... వాడికి హెచ్ఐవీ రాలేదు. నా బిడ్డను చేతుల్లోకి తీసుకొని తనివితీరా ముద్దాడనైనా లేదు, నా భర్త వచ్చి బిడ్డను తీసుకెళ్లిపోయాడు. రెండు వైపులా వాదనలు లేకుండానే, మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యే అవకాశాన్ని నాకు ఇవ్వకుండానే విడాకులు మంజూరయ్యాయి. ‘హెచ్ఐవీతో బిడ్డను ఎలా పోషించుకుంటావ్ అని బిడ్డ పెంపకాన్నీ ఆయనకే అప్పజెప్పింది కోర్టు’ అంటూ రెండు చేతుల్లో మొహం దాచుకొని వెక్కివెక్కి ఏడ్చింది జ్యోతి.
ఆ తర్వాత..
అనుకున్నవి అందనప్పుడు జీవితం ఆగిపోదని... పోరాడి వాటిని పొందడానికి చచ్చే వరకు బతికుండాలని నేర్చుకుంది జ్యోతి. ఓ పక్క ఒంట్లోని హెచ్ఐవీతో పోరాడుతూనే, ఆకలిని జయించే ప్రయత్నమూ చేయసాగింది. చాలా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల వేట కొనసాగించింది. కొన్ని మాత్రమే అవకాశం ఇచ్చాయి. అవీ కొన్నాళ్లే. మరోపక్క హెచ్ఐవీ పాజిటివ్స్ కోసం పనిచేసే సంస్థలతోనూ పరిచయం పెంచుకుంది. ఆ క్రమంలోనే తారసపడ్డాడు వివేక్. ఆయన హెచ్ఐవీలేని మనిషి. జ్యోతిలోని ఆత్మవిశ్వాసం వివేక్ని అబ్బురపరచింది.
పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని అడిగాడు. నమ్మకంలేని ఆమె నవ్వి ఊరుకుంది. ఏడాది తర్వాత మళ్లీ అడిగాడు... ఈసారి ఒప్పుకుంది. వివేక్ ఆమెకు మంచి తోడయ్యాడు. నాలుగేళ్లుగా వాళ్ల కాపురంలో ఎలాంటి కలతలూ లేవు. వివేక్ సహకారంతోనే ‘బ్లాక్స్వాన్ ఎంటర్టైన్మెంట్’ సంస్థను స్థాపించింది. అతడి అండతోనే తన కొడుకు విజిటింగ్ రైట్స్ కోసమూ కోర్టులో పిటిషన్ వేసింది. ‘ఇప్పుడు నాకెలాంటి రిగ్రెట్స్ లేవు. కానీ నా కొడుకు విషయంలోనే.. నాకు పట్టిన గతే వాడికి పడుతుందేమోనని భయం.
నేనూ సొంతతల్లి ఉండీ సవతితల్లి పెంపకంలో చేదు బాల్యాన్ని గడిపాను. ఇప్పుడు నా కొడుకూ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడేమో అనిపిస్తుంటుంది. వాడిని నా దగ్గరకి తెచ్చేసుకోవాలి. వాడి ఆలనాపాలనా చూడాలి. తల్లిగా నాకిప్పుడు ఈ ప్రయారిటీ తప్ప ఇంకేదీ లేదు’ అంటుంది జ్యోతి స్థిరంగా. అనుక్షణం తనను ఓడించాలని చూస్తున్న విధికి ఆత్మవిశ్వాసంతో సమాధానం చెబుతున్న జ్యోతిని మించిన విజేతలెవరుంటారు! స్ఫూర్తికి ఆమెను మించిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏముంటుంది!
బాల్యం ఆమెకో చేదు జ్ఞాపకం
జ్యోతి చెప్పినట్టుగా బాల్యం ఆమెకో చేదు జ్ఞాపకం. తండ్రి ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్. ఆమెకు ఎనిమిదేళ్లున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. మూడేళ్ల వయసులో తండ్రితో కలిసి మోటార్‌బైక్ మీద వెళ్తుంటే టైర్ బరస్ట్ అయి కిందపడిపోయింది. అప్పుడే ‘బైలేటరల్ సెన్సారి న్యూరల్ హియరింగ్ లాస్ (bilateral sensorineural hearing loss)’ అనే డిజార్డర్‌కి గురైంది. మామూలుగా మాట్లాడినా ఆమెకు రైలింజన్ మోతలా వినపడుతుంది.
ఈ లోపం వల్లనే తండ్రిలాగా ఫైటర్ పైలట్ కావాలన్న తన కలను నెరవేర్చుకోలేకపోయింది. సవతితల్లి వేధింపులు, తండ్రి నుంచి కరువైన ప్రేమ.. జ్యోతికి భయంకరమైన బాల్యాన్ని మిగిల్చాయి. అయినా ఆమె స్థైర్యం చెక్కు చెదరలేదు.