ప్రజలను రెచ్చగొట్టుడే కేసీఆర్ నైజం
♦ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు బుద్ధి చెప్పండి
♦ సీఎల్పీ నేత జానారెడ్డి పిలుపు
♦ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?: దామోదర రాజనర్సింహ
♦ నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ బహిరంగ సభ
నారాయణఖేడ్: అడుగడుగునా ప్రజలను సెంటిమెంట్ పేరుతో రెచ్చగొట్టుడే ముఖ్యమంత్రి కేసీఆర్ నైజమని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
టీఆర్ఎస్ కుల వివక్ష, నియంతృత్వం, కక్షలు, కార్పణ్యాలకు పాల్పడుతోందని జానారెడ్డి ఆరోపించారు. ఇలాంటి పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని గుర్తుచేశారు. జాతి సమైక్యత కోసం ఇందిరాగాంధీ తన జీవితం త్యాగం చేసినట్లు చెప్పారు. సోనియాగాంధీ సైతం ప్రధాని పదవిని త్యాగం చేశారని, త్యాగాలు చేయడం కాంగ్రెస్ పార్టీ నైజం అని పేర్కొన్నారు.
ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటే అభివృద్ధి చేసేవారని, కానీ పోటీ చేస్తూ సీటు లాక్కోవడానికి యత్నిస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నా, లేకున్నా కాంగ్రెస్ ప్రజల కోసం పోరాడుతుందన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగమూ రాలేదన్నారు.
తెలంగాణలో 1.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. విడతల వారీగా రుణమాఫీలు చేస్తూ రైతులను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే కరువు ఏర్పడిందని విమర్శించారు. వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ పథకాలపై చర్చకు సిద్ధమేనని అన్నారు. మూడెకరాల భూమి, దళితులకు సీఎం పదవి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
సభలో ఎమ్మెల్యే జె.గీతారెడ్డి, మాజీ విప్ జగ్గారెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి, మాజీ ఎంపీలు సురేశ్ షెట్కార్, మధుయాష్కి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, చిన్నారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, గంగారాం, బండి నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్‌లో కాంగ్రెస్‌దే గెలుపు: జానా
జోగిపేట: నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు. బుధవారం జోగిపేటలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసినా కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకోలేదన్నారు. టీఆర్ఎస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.