మన సమగ్రతకు ‘మణిపూర్’ తూట్లు
ఎక్కడో దేశానికి ఒక కొసన ఉన్న మణిపూర్‌లో జరిగిన ఒక చిన్న ఘటన రెండు రాష్ట్రాల్లోని తెలుగు కుటుంబాలు, వారి పిల్లలు తల్లడిల్లిపోయేలా చేసింది. మన జాతీయ సమగ్రతకు ఇలాంటి ఘటనలు భంగం కలిగిస్తాయనే ఆందోళన కూడా అందరిలో పెరుగుతోంది.
ఒక చిన్న రాష్ట్రమైన మణిపూర్‌లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఎన్ఐటీ) మెస్‌లో కొద్దిమంది విద్యార్థుల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ జాతీయ వార్త కావడం, స్థానిక, స్థానికేతర సమస్యగా మారి రోజుల తరబడి చర్చకు దారితీయడం దుర దృష్టం అనడంకన్నా దేశ దౌర్భాగ్యమనే చెప్పాలి. స్థానికతపై అవసరానికి మించి ఇక్కడ రేగుతున్న వివాదాలకు పై ఘటన తోడవడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. జాతీయ మీడి యా ఈ వార్తలకు ప్రాధాన్యమివ్వడంతో అక్కడేదో ఉత్పాతం జరుగుతోందన్న అనుమానాలు వ్యాపించాయి. ఎన్ఐటీ విద్యా ర్థుల మధ్య ఘర్షణను స్థానికతలో భాగం గా చూడాలా లేక కొందరు విద్యార్థుల మధ్య పరస్పర గొడవగా మాత్రమే చూడాలా అనేది ఇప్పుడు చర్చ. ఈ చిన్న ఉదంతం కొన్ని రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిం చింది. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన జాతీయ సమగ్రత నేటికీ బలమైన పునాదులు వేసుకోకపోవడమే దీనికి కారణమా?
ఎన్ఐటీలో గొడవ సద్దుమణిగిందని, భయాందోళనలకు గురికావద్దని మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు ప్రకటించేంతవరకు అక్కడి గొడవ పతాక శీర్షికలకు ఎక్కుతూవచ్చింది. ఆయన మన తెలుగువారు కావడంతో ఆ ప్రకటనకు విశ్వసనీయత కూడా ఏర్పడింది. మణిపూర్‌లోని లాంగోల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో ఈ నెల 11న మెస్‌లో క్యూ పాటించే విషయంలో విద్యార్థుల మధ్య చిన్న గొడవ జరిగింది. స్థానిక విద్యార్థులు క్యూను పాటించకుండా ముందుకెళ్లడంతో వెనుక ఉన్న స్థానికేతరులు ప్రశ్నించారని, ఇదే ఘర్షణకు దారితీసిందని వార్తలు.
బీహార్ విద్యార్థులకు, తెలుగు విద్యార్థులు సహాయంగా వచ్చారని, దీంతో మనవారిని స్థానికులు గదుల్లో వేసి కొట్టా రని, వారున్న గదులపైకి రాళ్లు విసిరారని వార్తలు. ఇటు తెలం గాణ, అటు ఏపీకి చెందిన విద్యార్థులకు తీవ్ర గాయాల య్యాయని మీడియా తెలపడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబంధిత కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. బాత్రూముల్లో వేసి హింసించారని, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండమని, తెలుగు విద్యార్థులు మీడియాకు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఆగమేఘాల మీద మణిపూర్ సీఎంతో, ప్రభుత్వాధికారులతో మాట్లాడటం, కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి ఉన్నఫళాన లాంగోల్‌లోని ఎన్ఐటీ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థుల రక్షణకు సీఆర్పీ ఎఫ్ బలగాలను కూడా దించారు. అయినా రక్షణ కరువైందన్న తెలుగు విద్యార్థులను మన ప్రభుత్వాలు విమానాల్లో స్వస్థలా లకు చేర్చాయి.
కథ సుఖాంతమైంది కాని దేశంలో ఎక్కడ పుట్టినా, ఎక్కడ చదివినా, జీవించినా మనం అందరం ఒక దేశవాసులమనే జాతీయ సమగ్రతా భావానికి మణిపూర్ ఉదంతం మరోసారి తూట్లు పొడిచింది. ఈ ఉదంతంపై వేగంగా సాగిన ప్రచారం మణిపూర్ గౌరవానికి భంగం కలిగించింది. ఈశాన్య భారత విద్యార్థులపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన దాడులు, హత్యలు వంటివి జాతీయ ఉమ్మడి సంస్కృతిని ప్రశ్నార్థకం చేశాయి. ఇప్పుడు మణిపూర్‌లోనే విద్యార్థుల మధ్య గొడవ స్థానికత రంగు పులుముకోవడం జాతీయ విషాదమే. ప్రతిష్టాకరమైన విద్యాసంస్థలో గొడవలేమిటి? మెస్‌లో జరిగిన చిన్న ఘర్షణ అదుపుకోసం సీఆర్పీఎఫ్ బలగాలు రావడమేం టి? ఒక చిన్న సమస్యను ఇంతగా ప్రచారం చేయడమేమిటి?
మరోవైపున మణిపూర్ స్థానిక పత్రికలు ఈ గొడవకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. గొడవ జరిగింది మొదలు కుని సమసిపోయేంత వరకూ హాస్టల్లో ఏం జరిగిందో ప్రత్య క్షంగా చూసిన మణిపూర్ ఎన్ఐటీ విద్యార్థులు తమ సంస్థకు చెడ్డపేరు తేవద్దని మీడియాను అభ్యర్థించారు. గొడవ జరిగిన ప్పటి నుంచి సర్ది చెప్పడానికి తాము ప్రయత్నించామని, ఒక గ్రూపు మరో గ్రూపుతో ఘర్షించుకున్న నేపథ్యంలో ఎవరు ఎవరిమీదికి రాళ్లు విసిరింది కూడా తెలియలేదని వీరు ఒక ప్రకటనలో తెలిపారు. హాస్టల్లో చిక్కుకున్న విద్యార్థులు తాత్కాలికంగా తీవ్రంగా ఇబ్బందిపడిన మాట వాస్తవం. కానీ గొడవ ఎంత వేగంగా వ్యాపించిందో అంత త్వరగా సమసి పోయిందన్నారు.
కనీస ఆధారం లేకుండా ఈ గొడవపై వార్తలు, కథనాలు ప్రచురించడమే మరింత నష్టకరంగా మారిందని ఎన్ఐటీ తటస్థ విద్యార్థులు వాపోవడం గమనార్హం. నిప్పు లేకుండానే పొగ రావడంపై ఇటీవల వదంతుల వ్యాప్తి కారణంగా ఈ మధ్య కాలంలో ఉద్రిక్తతలు రాజుకోవడం కనబడుతూనే ఉంది. మణిపూర్ గొడవలో కూడా ఈ కోణం ఉన్నదని గ్రహించాలి. జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో కూడా భావి పౌరుల మధ్య ఉమ్మడి భావన అనుకున్నంతగా ఏర్పడటం లేదని ఈ ఘటన రుజువు చేస్తోంది. ఇలాంటి ఘటనలపై కాస్త సంయమనం ప్రదర్శించడం అందరికీ మంచిది. అవసరం కూడా.
కె.రాజశేఖరరాజు