కైకలూరు మార్కెట్లో మళ్లీ అగ్నిప్రమాదం
కైకలూరు, న్యూస్‌లైన్ :
కైకలూరు నీలం సంజీవరెడ్డి సంత మార్కెట్లో మంగళవారం ఓ చికెన్ సెంటర్లో అగ్నిప్రమాదం ఘటన కలకలం సృష్టించింది. గత నెల 12న ఇక్కడ బజ్జీల బండి వద్ద స్టౌ పేలి కుళాయిలో వేడి నూనె చిమ్మడంతో 10 మంది గాయపడ్డారు. వారిలో నలుగురు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన మరువకముందే సంతమార్కెట్లో మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో పిచ్చికల సూర్యనారాయణకు చెందిన చికెన్ దుకాణం వద్ద గ్యాస్ సిలిండర్ పైపు నుంచి మంటలు వ్యాపించాయి. కొద్ది నిముషాల్లోనే దుకాణం మొత్తం కాలిపోయింది. ఈ ఘటన లో 30 కోళ్లు దగ్ధమయ్యాయి. దుకాణం వెనుక నివాసం ఉంటున్నామని, అక్కడ వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీకయిందని దుకాణ యజమాని సూర్యనారాయణ చెప్పా డు. ఈ ఘటన జరిగిన సమయంలోనే గోపవరం గ్రామం లో గడ్డివామికి నిప్పంటుకోవడంతో ఫైరింజన్ అక్కడకు వె ళ్లింది. దీంతో సంతలో వ్యాపారులు స్పందించి, చికెన్ దు కాణంలో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయంటూ పుకార్లు రేగడంతో ఆ ప్రాంతం లోనివారు భయంతో పరుగులు తీశారు.
కొరవడిన అధికారుల నిఘా..
ఇటీవల భారీ అగ్నిప్రమాదం జరిగి నలుగురి ప్రాణాలు పోయినా అధికారుల్లో చలనం రాలేదు. ప్రమాదం జరిగిన చికెన్ దుకాణం వెనుక భాగాన ఏకంగా నాలుగు గ్యాస్ సి లిండర్లు ఉన్నాయి. ప్రతి మంగళవారం ఇక్కడి సంతకు వేల సంఖ్యలో కొనుగోలుదారులు వస్తుంటారు. ఇక్కడ విచ్చలవిడిగా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంటున్నాయి. అధికారులు స్పందించి, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.